ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

రాజకీయాలు



శివ-రామ వివాదం
         

        ఆంధ్రప్రభ 16-8-1987                                        
                   11-8-87 నాటి అంతస్థుకు తగని పనిసంపాదకీయం ఆలోచనీయంగా ఉంది.         నేటి రాజకీయ నాయకులంతా తమ నోటిని అదుపులో పెట్టకోవటం అవసరం. శ్రీ     శివశంకర్ ముఖ్యమంత్రి పై నోరు పారవేసుకోవటం నిశ్చయంగా నేరమే. ముఖ్యమంత్రి       కూడా తిరిగి అదే మాట అనకుండా నిగ్రహించుకోవటం అభినందనీయం. హృదయాన్ని     బట్టి నోరు మాట్లాడుతుందనే ఏసుక్రీస్తు సూక్తిని మన ప్రజా ప్రతినిధులు కొంచెం         మననం చేసుకోవటం మంచిది. గుండెల్లో ఎంత అగ్ని రగులుతున్నా దాన్ని బయటికి         వెల్లడించేటప్పుడు పదిమంది కోసం మర్యాదకరంగానే వెల్లడించాలి. ఒకరివైపు వేలు     చూపిస్తూ ఉంటే మూడు వేళ్లు మన వైపే చూపిస్తూ ఉండం లేదా? అనేముందు ఆత్మ    విమర్శ చేసుకోవాలి. పవిత్ర క్విట్-ఇండియా నినాదాన్ని రాష్ట్ర కాంగీ నాయకులు    క్విట్-ఎన్ టి ఆర్ గా మార్చి చెప్పుకోవటం వారి బుద్ధి జాతీయతాభావనకు నిదర్శనంగా లేదు. మంచి పనలు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి గాని కక్షలు         తీర్చుకోవటం వల్ల తిట్టుకోవటం వల్ల జనానికి ఒరిగేది ఏముంది?


ఎన్జీవోలకిచ్చో ఇళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తారా?
                                                           
          ఆంధ్రభూమి 23-9-1989                                  
                        ఈసారి గెలుస్తారా లేదా అనే సంగతి   ఎమ్మెల్యేలందరికీ రాజధాని    నగరంలో ఇళ్ళు కట్టించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు.       చదరపు గజం స్థలం కేవలం 62 రూపాయలకే లభింపచేశారు. ఓడిపోయిన   ఎమ్మెల్యేలు కూడా ఇక ఇక్కడే తిష్ట వేస్తారన్నమాట.

              అయిదేళ్ళ ఆయుర్ధాయం కూడా అనుమానాస్పదంగా ఉన్న    శాసనసభ్యుల మీద చూపిన జాలి మక్కువ ముఖ్యమంత్రి ఎన్జీవోల మీద      చూపలేదు.  హైదరాబాదులోని ఎన్జీవోలు రిటైరయ్యేదాకా ఇక్కడే   పనిచేయాల్సింది తప్ప వేరే చోటికి బదిలి అయ్యే వీలు లేదు. జీవితాంతం ఈ    నగరం లోనే మగ్గపడి ఉండాల్సిందే. ఎందరో ఎన్జీవోలు అద్దె కొంపలల్లో        అవస్థలు పడుతున్నారు.

              రిటైర్ అయ్యేనాటికి ప్రతి ఎన్జీవోకు కొత్త ఇంటి తాళం చెవులిచ్చి గృహప్రవేశం చేయిస్తాన్న తెలుగుదేశం నేత ఎన్నికల వాగ్ధానం ఏమైపోయింది.
              ఎమ్మెల్యేల కెందుకండీ ఇళ్ళు ఇవ్వటం. వాళ్ళేమైనా దళిత వర్గాలకు చెందినవారా? ఆర్ధికంగా వెనుకబడ్డవారా? రాజ్యాంగాన్ని కాదని నిరంకుశంగా వ్యవహరించటమంటే ఇదే.

              ప్రజలు నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి అవగాహన కలిగించాలి.


                                                     ఆ రోజే దొరికిందా?        

        ఆంధ్రప్రభ 8-1-1988                                                                                                                           
                   జనవరి తొమ్మిదో తేదీన తెలుగుదేశం ప్రభుత్వం అయిదో వార్షికోత్సవం జరగనుండగా అదే రోజన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని శ్రీనివాసులురెడ్డి పిలుపు     నివ్వటం హింసా ప్రవృత్తిని వెల్లడిస్తున్నది. బంద్ పాటంచడానికి మరో రోజే దొరకలేదా?         వార్షికోత్సవాలకు వచ్చే వారిని అడ్డగించి రాకపోకలను స్తంభింపజేసి, రాష్ట్రంలో       ఎక్కడికక్కడే కొట్లాటలను పురికొల్పే ప్రయత్నమే ఇది. శీనయ్య సేన, కాంగ్రెస్, సి.పి.ఐ         మొదలైన తెలుగు దేశం వ్యతిరేక శక్తులన్నీ ఏకమై వార్షికోత్సవాలకు వచ్చే వారితో         తలపడవచ్చు. అసలే ఉద్రిక్తంగా ఉన్న రాష్ట్ర పరిస్థితి ఇందువల్ల మరింత         విషమించవచ్చు. ఆ విధంగా శాంతి భద్రతలు దెబ్బతినాలనే కోర్కె తోనే ఆయన       అలాంటి పిలుపును ఇచ్చారా అన్న అనుమానం కలుగుతున్నది. ఇక ఆ రోజున జరిగే         హింసా కాండకు శ్రీనివాసులు రెడ్డి, ఆయన్ని ప్రోత్సహించే శక్తులు మాత్రమే       కారణభూతులౌతారు.


హామీలు మాని పని చేయండి
ఆంధ్రజ్యోతి  18-5-1989                                                                                                
              ఈనాడు ప్రజాస్వామ్యం చలువ వల్ల అనేక పార్టీలు        పుట్టుకొస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రతి పార్టీ అనేక వాగ్ధానాలు చేస్తున్నది. ఆ వాగ్ధానాలు నెరవేర్చకుండానే కాలం గడిపి మళ్లీ వాగ్ధానాలు చేసి గెలుస్తున్నాయి. అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు, కేంద్రం       పావులాటలు, ఆయారాం, గయారాం చిందులాటలు, ప్రభుత్వాల రద్దులు,    రాష్ట్రపతి పాలనలు, వెన్ను పోటుల తోటి పుణ్య కాలం కాస్తా       పూర్తవుతున్నది. ఇక్కడ దేశ జనం గమనించాల్సిన ముఖ్య విషయం     ఏమిటంటే ఏ పార్టీ అయినా తాను చేసిన వాగ్ధానాలు నెరవేర్చక పోతే దానిని ఏం చెయ్యాలి? మరోసారి ఓటెయ్యకుండా ఉండటం మినహా మలో మార్గమే     లేదా? రాజకీయ పార్టీలు అన్న మాట నిలబెట్టుకునేలా చేయటం ఎలా?        అధికారంలోకి వచ్చిన పార్టీ తాను చేసిన వాగ్ధానాలు అమలు చెయ్యటం     తన మొదటి ఏటి పాలన నుండే ప్రారంభించాలి. వాగ్ధానం అమలు      చెయ్యలేని పార్టీని, నాయకుణ్ణి శాశ్వతంగా ఎన్నికల్లో పాల్గొనకుండా        చెయ్యాలి. వాగ్ధానాల అమలు కోసం ప్రతి పార్టీ కోర్టులో ఒక కాంట్రాక్టు వ్రాసి     ఇవ్వాలి. కాంట్రాక్టును చెడగొట్టిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లుగా        రాజకీయ నాయకుల్ని కూడా పెట్టాలి.


వాగ్ధాన భంగం కూడదు
అంధ్రజ్యోతి  4.11.89                                                             
              శ్రీ రామారావు గారి ప్రభుత్వం ఇటీవల తీసుకొన్న నిర్ణయాలు రాష్ట్రాన్ని క్రుంగదీసేవిగా ఉన్నాయి. హోటళ్ళ తినుబండారాల విషయంలో      ప్రభుత్వం వేలు పెట్టింది మొదలుకొని ప్రజల అవస్థలు ఆరంభమయ్యాయి. గ్రామాధికారుల వ్యవస్థ రద్దు. శాసనమండలి రద్దు. మండలాల స్థాపన లాంటి       గొప్ప మేలైన పనులు చేసిన ప్రభుత్వం ఆ కీర్తిని నిలబెట్టుకోలేకపోయింది.
              బస్సు చార్జీలు, పాలధర పెరగడం, పండ్ల చెట్ల మీద పన్ను     వేస్తాననడం మధ్యాహ్న భోజన పథకం రద్దు చేయడం ప్రజా సంక్షేమాన్ని   దెబ్బ తీసే నిర్ణయాలు. ఈ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
              ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడతానని ఎన్నికలకు ముందు చేసిన   వాగ్ధానాలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. సుస్థిరంగా నిలబడాలనుకొనే      ప్రభుత్వం వాగ్ధాన భంగం చేయరాదు.
              ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు చేసే వాగ్ధానాలను అమలు   పరిచే        విధంగా చట్టాలు చేసి, కోర్టుకు బాధ్యులయ్యేలా చేయాలని సుప్రీంకోర్టు       న్యాయమూర్తి శ్రీ చిన్నపరెడ్డి చేసిన సూచన ప్రస్తుతం అవసరం.


'పలుకే బంగారం' గా పార్లమెంటు సభ్యులు
ఆంధ్రప్రభ 10-5-1989                                          
              మన పార్లమెంటు సభ్యులందరి కంటే శ్రీ యలమంచిలి శివాజీగారు    ఎక్కువ ప్రశ్నలు వేసినట్లుగా వెల్లడి కావడం సంతోషం. అలాగే అసలు ప్రశ్నలే వెయ్యని పార్లమెంటు సభ్యుల పేర్లు కూడా ప్రభుత్వం వెల్లడిస్తే     ప్రజలు చూచి తరిస్తారు. ప్రభుత్వం ఈ పని చెయ్యటానికి సిగ్గు పడుతున్నట్లయితే కనీసం పత్రికలవాళ్ళయినా ఇలాంటి వాళ్ళ జాబితా ప్రతి   సమావేశానంతరం ప్రచురిస్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం పట్టం గట్టి పంపిన ప్రతినిధులు ప్రశ్నలడుగుతున్నారో, నిద్రపోతున్నారో, మైకులు  విరగ్గొడుతున్నారో ప్రత్యక్షంగా చూచే భాగ్యం దూరదర్శన్ కల్పించకూడదని కేంద్రం నియమం పెట్టింది గనుక ఫలానా సభ్యుడు ఇన్ని ప్రశ్నలు వేశాడు  అనే పట్టికలన్నా ప్రచురిస్తే ప్రతినిధి ప్రతిభను ప్రజలు అంచనా     వేసుకుంటారు.


ఎన్నికల ప్రణాళికలు రిజిస్టర్ చేయించాలి
                                                           
          ఆంధ్రజ్యోతి 1-11-1989                                     

                        నేషనల్ ఫ్రంట్ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక నిజంగా అమలు   జరిగితే దేశం దశ తిరిగిపోతుంది. కాని దాని ఛైర్మన్ గా ఉన్న తెలుగుదేశం   అధినేత 'తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో' ను గతంలో ఎంతవరకు అమలు చేశారు? లోకాయుక్త పరిధిలో నుండి ముఖ్యమంత్రిని తప్పించడం, భూ సంస్కరణలు అమలు చేయకపోవటం, నాయకుల ఆస్తులు వెల్లడించకుండా        సీల్డ్ కవర్లలో దాచటం, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయకపోవడం, ఎన్జీవోలకు        చేసిన వాగ్ధానాలు నేరవేర్చకపోవడం మొదలైన విషయాలు నేషనల్ ఫ్రంట్ మేనిఫెస్టో కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఆయన అధ్యక్షతనే    ఈ రకమైన మేనిఫెస్టో వెలువడటం వింతగా ఉంది. అది అమలు కావటం    అనుమానాస్పందంగా ఉంది. తెలుసుకునే హక్కు, పని హక్కు అధికార     వికేంద్రీకరణ, ఋణాల మాఫీ లాంటి గొప్ప విషయాలు కూడా వాగ్ధానం       చేశారు. ఈ వాగ్ధానాలు నెరవేర్చకపోతే ప్రజలు ఏం చెయ్యాలి! అందుకనే ప్రతి పార్టీ మేనిఫెస్టోను సుప్రీం కోర్టులో కాంట్రాక్టులాగా రిజిస్టర్ చేయించాలి.        కాంట్రాక్టు నెరవేర్టలేని వారి శిక్షలు పడాలి. వాళ్ళకు అనర్హులుగా ప్రకటించాలి.


తెలుగుదేశం ఎలా గెలిచింది?
                                                           
          ఈనాడు 21-3-1987                                            

                        మండల ఎన్నికల ఫలితాలపై భారతీయ జనతా పార్టీ నాయకుడు శ్రీ   బండారు దత్తాత్రేయ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల      లితాలు విధంగా ఉంటాయని బిజెపి వారు ముందే ఊహించారట. మరైతే పోటీ చేయడమెందుకు? రాష్ట్రంలో తృతీయ రాజకీయ శక్తి బిజెపి మినహా మరేదీ లేదని ఇలాగే ఉంటాయని ముందుగానే ఊహించుకుని చెప్పి  ఉంటారా? తెలుగుదేశం గెలిస్తే అది ఎన్టీఆర్ పై ప్రజలకు ఉన్న వ్యక్తిగత అభిమానమేనని, అంతేగాని రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం విధానాలను   ఆమోదించలేదని శ్రీ దత్తాత్రేయ అంటున్నారు. ఓటర్లను మాత్రం ఆలోచన  లేని మూఢులుగా అంచనా వేయడం కూడని పని. ఇదే ప్రజలు కాంగ్రెస్ ను ఓడించి జనతాను గెలిపించినపుడు వారికి ఇందిరమ్మపై వ్యక్తిగత అభిమానం  ఎక్కడికి పోయింది? బిజెపి నాయకులు కూడా కాంగ్రెస్ వాళ్ళలాగానే       సంకుచిత తత్వంతో ఆలోచిస్తే ఎలా?



పదవే ప్రాణమా ?
ఆంధ్రప్రభ 26-11-1987                                 
              పదవికి ప్రాణానికీ ఉన్న లంకె ఎంత బలీయమైనదో శ్రీ శ్రీనివాసులు   రెడ్డి ఆక్రోశం చూస్తే అర్ధమైపోతున్నది. నా పదవి పీకారు.. నా కత్తుక పరపర      కోశారు అని ఆయన విలవిలలాడి పోవడం బహువిచిత్రంగా ఉంది. పదవి      పోయినంత మాత్రాన ప్రాణం తీసినట్లుగా ఆక్రందన చేస్తున్న శీనయ్య     బాధ చూస్తుంటే ఈయన ఎంత పదవీ లోలుడో అనిపిస్తున్నది. ఆ పదవిని     నిలబెట్టుకోటానికి నాలుగేళ్ళ పాటు అవినీతికి దాసోహం అని, అక్రమాలకు   సైతం వత్తాసు పలికిన శ్రీనివాసులు రెడ్డి గారు అసలు మంత్రి పదవికి       అర్హుడేనా అనే అనుమానం వస్తున్నది. రాష్ట్రం లోనే కాదు కేంద్రంలో కూడా    ఇలా పదవుల పరిరక్షణ కోసం అంతరాత్మనూ, విచక్షణాజ్ఞానాన్ని వ్యక్తిత్వాన్నీ చంపుకొని అవినీతి నాయకుల కాళ్ళు పట్టుకునే వారు ఉన్నారు. ఇలాంటి వారు ఒక మందగా తయారయితే, దేశం కాకపోయినా       పార్టీ అయినా అధినాయకుడి సొంత జాగీరే అవుతుంది. 



శీనయ్య పద్ధతి బాగోలేదు
ఈనాడు 20-11-1987                                    
              ఇటీవల ఈనాడులో 'శీనాయణం' సంపాదకీయం నిష్పక్షపాతంగా      ఉంది. మంత్రి పదవి పోయిన తర్వాత శ్రీ శ్రీనివాసులు రెడ్డికి ప్రభుత్వంలోని   అనేక అక్రమాలు ఒకేసారి గుర్తుకు వచ్చివట్లున్నాయి. గత నాలుగేళ్ళుగా       ఆయన కూడ ఈ ప్రభుత్వంలో భాగమేకదా! దుడ్డుకర్రా దుడ్డుకర్రా... ఎవరిమాట వింటావే అంటే, ఎవరి చేతిలో ఉంటే వారిమాట అందట. శీనయ్య        ధోరణి ప్రస్తుతం అలానే ఉంది. 'నంబర్ టూ' గా ప్రకటించుకున్న        మంత్రులుకూడ చంకలో పిల్లాడిలాగా ప్రవర్తించబట్టే కదా నియంతృత్వం   కొనసాగింది. తనను ఇప్పుడు జాతరలో బలి ఇచ్చిన దున్నపోతులాగా పోల్చుకోవటం విచారకరం. శ్రీనివాసులు రెడ్డి లాంటి వ్యక్తి ప్రవర్తన హుందాగా లేదు. ముఖ్యమంత్రి ల్యాండ్ సీలింగ్ పనులుకు తానే సహకరించినట్లు మాజీ        రెవెన్యూ మంత్రి చెబుతున్నారని వార్త. బోఫోర్స, ఫెయిర్ ఫాక్స్ సమస్యలను       దుమ్మెత్తి పోస్తున్న తెలుగుదేశం పార్టీలోనే అవినీతి గొడవలు చెలరేగటం ఆందోళన కల్గిస్తోంది. వీటిపైన విచారణకు ఆదేశించి ప్రజల నమ్మకాన్ని    నిలుపుకోవాలి.


కమ్యూనిస్టుల ఐక్యత
ఈనాడు 30-3-1987                                     నూర్ బాషా రహంతుల్లా
                                                              హైదరాబాద్
              సి.పి.యం తమతో చేతులు కలిపి ఉంటే రాష్ట్రంలో మూడో బలీయమైన       శక్తి ఆవిర్భవించి ఉండేదని రాష్ట్ర సి.పి.ఐ కార్యదర్శి శ్రీ నల్లమల గిరిప్రసాద్               గారు ఆలస్యంగానైనా గుర్తించటం హర్షణీయం. అయితే ఇలాంటి ఐక్యత కోసం      ఉభయ కమ్యూనిస్టులు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఒకరిపై ఒకరు      కత్తులు దూసుకుంటూ, నిత్యమూ చీలు ఉంటూ బూర్జువాపార్టీలకు పట్టం గట్టిన పాపం ఈ కమ్యూనిస్టులదే గదా? నాయకత్వాల కోసం ఎవరికి వారు    గతంలో అర్రులు చాచారే గాని, పీడిత పేదప్రజానీకం శ్రేయస్సును దృష్టిలో     ఉంచుకున్నారా? ఆశయాలు మంచివైయుండికూడా ప్రజల ఆశీస్సులు        లభించలేదంటే కారణం? వారు చీలిపోవటమే! ఇప్పటికైనా కంకీ కొడవలిని,   సుత్తీ కొడవలినీ కలిపివేయాలి. కమ్యూనిస్టులంతా, ముందు ఐక్యం కావాలి.      ఆ తరువాత శ్రామికుల ఐక్యత గురించి మాట్లాడవచ్చు.



కాంగ్రెసు పై ఇంత వ్యామోహమా ?
ఆంధ్రప్రభ 4-5-1987         
              ఫెయిర్ ఫాక్స్, బోఫోర్స్ వ్యవహారాల గురించి శ్రీ విశ్వం అనే ఆయన   చేసిన ఆంగ్ల ప్రసంగం ఈ మధ్య స్పాట్ లైట్ కార్యక్రమంలో ఆకాశవాణి        ప్రసారం చేసింది. ఇరవై అయిదో తేదీన ఉదయం హైదరాబాదు రేడియో      కేంద్రం వారు కూడా వినిపించారు. ఆ ప్రసంగంలో దొర్లిన మాటలు,   ప్రసంగసారం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మనోభావాలకు  ప్రతిబింబం. దేశ సమైక్యతను, భద్రతను పరిరక్షించే ఏకైక శక్తి అలాంటి   కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మంట గలపడం ద్వారా ఆధారాలు లేని ఆరోపణలతో కాంగ్రెస్ ను పడగొట్టాలని దేశంలో అస్థిరతను సృష్టించాలని మన  ప్రతిపక్షాలు,  మరికొన్ని విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ  మీద ఆకాశవాణికి ఇంత వెర్రి వ్యామోహం ఎందుకో అర్థంకావడం లేదు.  స్వీడన్ రేడియోను చూశాకనైనా మన ఆకాశవాణి బుద్ధి తెచ్చుకోవాలి.



కాంగ్రెస్ కల్చర్ ఇదేనా ?
ఈనాడు 27-2-1987                                     
              ఎన్నో ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కల్చర్ కు అలవాటుపడిన ప్రజలను      మార్చడం ఎన్టీఆర్ వల్ల కాదని శ్రీ కోట్ల విజయభాస్కరరెడ్డిగారు అన్నారు. ఎంతో నవ్వు పుట్టించే విషయమే అయినప్పటికీ కోట్ల వారు చెప్పింది పచ్చి   నిజం. పదిరకాల ముఠాలతో అంతర్గత కుట్రలు, కక్షలతో అధిష్టాన వర్గం పావులాటతో విసిగిపోయిన జనం ఆ కల్చర్ నచ్చకే కదా మరొక పార్టీని        ఎన్నుకున్నారు! స్వంత తెలివితేటలతో ప్రశ్నించలేని వారు. అధిష్టాన వర్గానికి ఎదురు చెప్పలేనివారు కాంగ్రెసు కల్చర్ లో రాణించవచ్చు.       ఇంతకూ, కాంగ్రెస్ కల్చర్ అంటే విజయభాస్కర రెడ్డిగారి దృష్టిలో ఇదేనా లేక       ఆ కల్చర్ లో వేరే నిగూఢ సంప్రదాయాలేమైనా ఉన్నాయా! ఏది ఏమైనా        ఆయన అన్నట్లు ప్రజలు మార్పులేని వారు కారు. ఈనాడు రాష్ట్రంలోని ఓటర్లు రాజకీయ చైతన్యం విచక్షణా జ్ఞానం కలవారని అనేక సార్లు    రుజువైంది.


సర్పంచుల పట్ల చులకనభావం తగదు
ఈనాడు 13-12-1991     పోడూరు,                  
                                                                       
          ప్రజా ప్రతినిధులుగా ప్రజల నుండి ఎన్నికైన గ్రామ సర్పంచ్ ల పట్ల అధికారులు ప్రధానంగా పోలీసులు తేలిక భావంతో చూస్తున్నారని వృద్ధ కాంగ్రెస్ నాయకుడు జిన్నూరు సర్పంచ్ ఇందుకూరి సూరపరాజు ఆరోపించారు. బుధవారం జరిగిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు, అవకతవకలకు అన్యాయాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోలేని పోలీసులు సర్పంచ్ లు తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని ఇది సహించరాని విషయమని అన్నారు. కొవ్వూరు రూరల్ ఎస్.ఐ.ని సస్పెండ్ చేయాలని సూపరరాజు డిమాండ్ చేశారు. అధికారులం కాదు ప్రజాసేవకులం మాత్రమేనని ఆచంట ఎం.ఆర్.ఒ. రహింతుల్లా మాట్లాడుతూ అన్నారు. నేడు రాజకీయ నాయకులే అధికారులను ఆదేశిస్తూ నడిపిస్తున్నారని ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల మనుగడే ఉండదన్నారు. అధికారులు సర్పంచ్ లపట్లగానీ ఇతర ప్రజాప్రతినిధులను తేలికగా చూడడం జరగదన్నారు. 



సోషలిజానికి మార్గం లేదా?
                                                                               
               ఈనాడు  27-2-1986                           
              మన దేశం బాగుపడాలంటే, పేదలకు మేలు జరగాలంటే నిరుద్యోగ    సమస్య పరిష్కారమవ్వాలంటే కుక్క గొడుగు పార్టీలన్నీ ఏకం కావాలని        రాసిన ఒక పాఠకునిలేఖ ఈనాడులో చదివాను. మజ్లిస్ అధికారంలోకి వచ్చాక ఆయన ఈ అభిప్రాయానికి వచ్చినట్లుంది. సి.పి.ఐ., సి.పి.ఎం., బి.జె.పి., జనతా, కాంగ్రెస్ వంటివన్నీ జాతీయ పార్టీలా లేక కుక్క గొడుగు పార్టీలా? జాతీయ పార్టీలను కుక్క గొడుగుపార్టీలుగా పోల్చడం ఎంత వరకు  సబబు? వాస్తవం ఏమిటంటే పేదరికం పోవడానికి, పార్టీలు ఏకం కావడానికి పెద్ద సంబంధంలేదు. తన బడ్జెటు ప్రసంగ పాఠంలో పెద్ద ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రపతి చేర్చిన సోషలిజం ఉందే, దానిని తీసుకురావాలి. చిత్తశుద్ధి  ఉండాలే కాని సోషలిజం స్థాపన కష్టమేమీ కాదు. ఈ పార్టీలన్నీ అప్పుడు  అవసరమే. మార్గం ఉంది కాని మనసే లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి