ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

అందరికీ ఇల్లు



అందరికీ ఇల్లు నినాదప్రాయమేనా?
ఈనాడు 20-3-1992                                               నూర్ బాషా రహంతుల్లా  
పాలకొల్లు

2000 సంవత్సరం నాటికి అందరికీ గూడు కల్పించాలన్నది తమ ఆశయమని గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ (ఐ) పార్టీ ప్రకటించింది. దరిమిలా అధికారం చేపట్టినవారు ఆ వాగ్ధానాన్ని నెరవేర్చేందుకు ఏ విధమైన చర్యలూ తీసుకోవడంలేదు. పైగా ఈ ఆశయాన్ని దెబ్బతీసే విధంగా బడ్జెట్ లో సిమెంటు, పెయింటు, ఇనుప కడ్డీలు, తదితరాల మీద పన్ను పెంచారు. రక్షణవ్యయం, వడ్డీల చెల్లింపులు, సబ్సిడీల వ్యయం కలసి బడ్జెట్ లో సగాన్ని మింగేస్తున్నాయి. రక్షణ వ్యయం పూర్తిగా అనుత్పాదకం. అప్పులు చేయడం వల్ల దేశం రుణాలు ఊబిలోకి మరింతగా కూరుకుపోతోంది. ఈ ఖర్చులను కొంతవరకు నియంత్రించి, ప్రణాళికేతర వ్యయాన్ని పూర్తిగా అదుపు చేస్తే ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు అన్నది కలగా మిగిలిపోకుండా, నేడు కాకపోతే రేపయినా నిజమై నిలుస్తుంది.
 ఉద్యోగులకు సొంత ఇళ్ళు
ఆంధ్రప్రభ 29-7-1990                                              నూర్ బాషా రహంతుల్లా
ఏలూరు
ప్రభుత్వ భూముల్ని మార్కెట్ రేటుకు వివిధ సహకార గృహ నిర్మాణ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు అమ్మటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనాడు 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు గ్రామ స్థాయి నుండి రాజధాని నగరం వరకు విస్తరించి ఉన్నారు. వీరికి గృహ నిర్మాణం కోసం ప్రతి మండల, జిల్లా కేంద్రాలలో భూముల్ని కేటాయించవలసిన అవసరం ఎంతో ఉంది. గ్రామాలలో కూడా గ్రామోద్యోగుల కోసం క్వార్టర్లు నిర్మించాలి. ప్రతి మండల కేంద్రంలో అద్దె – కొనుగోలు పద్ధతి మీద ఉద్యోగులకు ఇళ్ళు కేటాయించాలి. పేద ప్రజలకు పక్కా ఇళ్ళ కార్యక్రమం ఆగిపోయింది. సంవత్సరానికి లక్ష ఇళ్ళ చొప్పున పక్కా ఇళ్ళు కట్టించి ఇస్తేనే 2000 సంవత్సరం నాటికి మన ప్రజలందరికీ ఇల్లు ఆశయం నెరవేరుతుంది. ఇళ్ళ నిర్మాణంపై పెట్టిన పెట్టుబడి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది వేస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి