ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

ఫలించని ఫథకం 'పట్టాదారు పుస్తకాలు'



ఫలించని ఫథకం  'పట్టాదారు పుస్తకాలు'
ఉత్తరప్రభ 31-7-1990                                               నూర్ బాషా రహంతుల్లా
                                                                 ఏలూరు, ప.గో.జిల్లా

కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో మొదలు పెట్టిన 'రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పథకం' ఎన్నో లొసుగులతో నీరుగారిపోయింది. ఏదో ఒక రీతిలో పట్టా పుస్తకాలు ప్రదానం చేసి చేతులు దులుపుకోవాలన్న ఆరాటమే తప్ప ఆ పుస్తకాలు వాస్తవ స్థితిని ప్రతిబింబించాలనే సదుద్దేశం ప్రభుత్వానికి లేనట్టున్నది. అలాంటి సదాశయమే ప్రభుత్వానికి ఉంటే ముందుగా భూముల సర్వే జరిపించి ఉండేది. భూముల సర్వే జరుపకుండా ఎప్పుడో  బ్రిటిష్ వాడు తయారుచేసిన సర్వే రిపోర్టుల ఆధారంగా పాస్ పుస్తకాల పంపిణీకి పూనుకోవటం వల్ల 'రికార్డ్ ఆఫ్ రైట్స్' అనేది ఒక ప్రహసనంగా మారింది. యజమానికి, అక్రమదారుడికి కౌలుదారుడికి మూడు రంగుల్లో పుస్తకాలు ఇస్తారట. పట్టాపుస్తకం కోసం భూమి హక్కుదారుడు తన దస్తావేజుల్తో దరఖాస్తు చేసుకోవాలట. ఈ బాధ్యతలన్నీ రైతు మీదనే నెట్టివేస్తే ఇక రిజిస్ట్రేషన్, రెవిన్యూ డిపార్ట్ మెంట్లు ఉన్నది ఎందుకో?

రిజిస్ట్రేషన్ డిపార్టమెంట్ తలుచుకుంటే నెలరోజుల్లో ఈ పుస్తకాలు ఇవ్వగలదు. అయితే రిజిస్ట్రేషన్ శాఖను వదిలేసి రెవిన్యూ వాళ్ళతో పట్టా పుస్తకాలు తయారు చేయించటానికి ప్రభుత్వం పూనుకున్నది. ఈ పని సక్రమంగా జరగాలంటే ముందు వ్యవసాయ భూముల సర్వే జరిపించాలి. రిజిస్ట్రేషన్ రుసుము ప్రస్తుతం 11 శాతంగా ఉంది. భూముల మార్కెట్ రేటు మళ్ళీ పెంచారు. ఈ ఆర్ధిక భారాన్ని భరించలేక రైతులు క్రయవిక్రయాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం లేదు. దస్తావేజులు రాసే వాళ్ళ దగ్గర నుంచి సబ్ రిజిస్ట్రార్ ల వరకు అంతా రైతుల నుండి డబ్బు గుంజుతున్నారు.

అందువల్ల రిజిస్ట్రేషన్ రుసుమును 1 శాతానికి తగ్గించాలి. కేవలం ఖజానా నింపుకుందామనే ఆశతో గాకుండా, రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. వివిధ రకాల డాక్యుమెంట్లు ప్రొఫార్మాలుగా ముద్రించి అమ్మాలి. ఖాళీలు పూర్తి చేసి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎవరికి వారే దాఖలు చేసుకునే అవకాశం ఇస్తే దస్తావేజులు రాసి ఇచ్చే వాళ్ళ అవసరం ఉండదు. పని సులభం అవుతుంది.

ఇలా చేసి రైతులు తమ భూమిని వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలని ఆదేశిస్తూ ఒక సంవత్సరం గడువు ఇస్తే అందరూ గడువు ముగియగానే రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్, తన పుస్తకాల ఆధారంగా అందరికీ, పట్టా పుస్తకాలు ఇవ్వవచ్చు. పధకాన్ని అల్లకల్లోలం చేసే బదులు ప్రభుత్వం ఈ పని చెయ్యాలి.



రిజిస్ట్రేషన్ రుసుం తగ్గించాలి
ఆంధ్రజ్యోతి 8-11-1990                                             ఎన్.  రహంతుల్లా
                                                                 ఏలూరు

వృత్తి పన్నును మునిసిపాలిలే వసూలు చేసుకొనే అధికారం ఇవ్వబోతున్నట్టు మంత్రి శ్రీ వెంగారెడ్డి చెప్పారు. అలాగే వినోదపు పన్ను వసూలు చేసే అధికారం కూడా ఇస్తే పది శాతం సర్వీస్ చార్జీ కూడా వాటికే మిగులుతుంది.

ఆస్తుల రిజిస్ట్రేషన్ రుసుంను 11 శాతం పెంచారు. ఇందువల్ల భూముల కొనుగోలు అమ్మకాలలో చాలా డబ్బు రిజిస్ట్రేషన్ కోసమే వెచ్చించవలసి వస్తున్నది. రిజిస్ట్రేషన్ రుసుంతో పాటు లంచాల భారం కూడా ఉంది. దస్తావేజులు రాసేవారి ఫీజు కూడా అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో రైతుల మీద భారం తగ్గించడానికి ప్రభుత్వం పూనుకోవాలి. దస్తావేజులను ప్రొఫార్మాలుగా ముద్రించి అమ్మితే సులభంగా ఎవరికి వారే పూర్తిచేసుకుంటారు. రిజిస్ట్రేషన్ రుసుమును ఒక్క శాతానికి తగ్గించి, లంచగొండుల మీద నిఘా అధికం చేయాలి.



       పట్టాదారు పాస్ పుస్తకాలు ఏమయ్యాయి ?
ఈనాడు 21-1-1993                                          

రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు  ఎప్పటికి ఇస్తారో అర్ధం కావడం లేదు. అసలు ఈ పుస్తకాలు ఇచ్చే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేనట్లుగా ఉంది. ఎందుకంటే ఈ పుస్తకాల ముద్రణకు మంజూరు చేసిన నిధులను వేరే పనుల కోసం తరలించినట్లు చెబుతున్నారు. ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పథకాన్ని పూర్తి చేసేందుకు సంకోచం ఎందుకు ? ఏ రైతుకు ఎంత భూమి ఉందో, ఏ రైతు ఎంత శిస్తు బాకీ ఉన్నాడో ఖచ్చితంగా చెప్పడానికి ఈ పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయి. శిస్తు బకాయుల వివరాలు స్పష్టంగా ఉంటే వసూలు సులువవుతుంది. బకాయిలు పూర్తిగా వసూలైతే ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పార్టీ విభేదాలకతీతంగా వ్యవహరించి, రైతు క్షేమం దృష్టిలో ఉంచుకుని పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.



పాసు పుస్తకాలపై నిరాసక్తి
ఈనాడు 16-2-1995                                                  
                                                               
       ఏప్రిల్ నాటికి రాష్ట్రంలోని రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలివ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నెరవేరే సూచనలు కన్పించడం లేదు. పట్టాదారు పాసు పుస్తకాలు జారీ మందకొడిగా సాగుతోంది. ఏవేవో అవాంతరాలొచ్చిపడుతుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో కార్యక్రమం మందగించింది. మళ్ళీ అంతలోనే స్థానిక సంస్థల హడావిడి. ఈ మధ్య కాలంలో ఏదైనా పని సాగుతుందేమో అనుకుంటే రైతులు ఆసక్తి చూపరు. రైతులు పాసు పుస్తకాలు కావాలని ముందుకు వచ్చి సహకరిస్తే గదా జారీ ఊపందుకునేది. కుక్క దొరికితే రాయి దొరకదు. రాయి దొరికితే కుక్క దొరకదు. రెండూ దొరికితే రాజు గారి కుక్క అన్నట్లుగా సాగుతోంది. ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ కార్యక్రమం రేషన్ కార్డుల కోసం విరగబడి వచ్చి క్యూలుగట్టే రైతులు పాసుపుస్తకాలిస్తామంటే మొఖం చాటేస్తున్నారు. వారి సమస్యలు వారికుంటాయి. కాని అవ్వను పట్టుకుని వసంతమాడినట్లు ప్రభుత్వం రెవిన్యూ అధికార్లను పట్టుకుని ప్రగతి ఏదీ, పురోగతి ఏదీ అని నిలదీస్తున్నది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిర్ణీత తేదీ ప్రకటించి ఆ తర్వాత పాస్ పుస్తకం లేనిదే అప్పులివ్వరాదని, రిజిస్ట్రేషన్లు చేయరాదని ఆదేశాలు జారీ చేయాలి. పాసు పుస్తకాలిచ్చే బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖకు అప్పగిస్తే పని చాలా వేగంగా జరుగుతుంది. సవాలక్ష బాధ్యతలు తలపై వేసుకున్న రెవిన్యూ శాఖకు ఈ భారం తొలగించాలి. 



భూమి శిస్తు రద్దు చేయడమే మంచిది
ఈనాడు 18-5-1995                                           
                                                 
రెవిన్యూశాఖను సరళతరం చేస్తామన్న మంత్రివర్యుల మాట వీనులకు విందుగా ఉంది. రెవిన్యూ శాఖ అంటే రెవిన్యూ (పన్నులు) వసూలు చేసే శాఖ మాత్రమే కాదు. సాధారణ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలు, శాంతిభద్రతలు, పౌరసరఫరాలు నిర్వహించే శాఖ రెవిన్యూ శాఖను భూమిశిస్తు వసూలు శిరోభారంగా పరిణమించింది. అయ్యవారి జీతం అర్ధణా. దానికోసం ఆరుమైళ్ళ నడక అన్నట్లుంది వ్యవహారం. వసూలవుతున్న మొత్తాన్ని అందుకు పెడుతున్న ఖర్చుతో పోల్చి చూస్తే ఇదంతా దండగమారి వ్యవహారమని ఇట్టే తెలిసిపోతుంది. రశీదు పుస్తకాలు, చిట్టాలు, కార్బన్ పేపర్లు, చలానాలు, గ్రామ సేవకుల ప్రయాణ భత్యాలు, రెవిన్యూ సిబ్బంది అలవెన్సులు కలిపి చూస్తే అల్లికి అల్లి సున్నకు సున్న. భూమిశిస్తు రద్దు చేస్తే రైతులు హర్షిస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి