ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

ప్రయాణీకులపై భారం వేయవద్దు



 ప్రయాణీకులపై భారం వేయవద్దు
ఆంధ్రభూమి 22-2-1990                                            నూర్ బాషా రహంతుల్లా
హైదరాబాద్

          ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖామంత్రి చెప్పటం శోచనీయం. తెలుగుదేశం ప్రభుత్వం బస్సు ఛార్జీలను పెంచాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బస్సు డిపోల వద్ద మోహరించి బస్సుల్ని కదలనీయకుండా బైటాయించారు.
       తమిళనాడులో సాధారణ ఎక్స్ ప్రెస్ బస్సుల ఛార్జీ ఒక కిలోమీటరుకు 9.5 పైసలు మాత్రమే ఉంది. రాష్ట్రంలోనైతే 10, 13 పైసలు ఉంది. సెమీ లగ్జరీకైతే 14 పైసలు ఉంది. పల్లవన్ ట్రాన్సపోర్టు కార్పొరేషన్ కు తమిళనాడు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధకు సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలి. జనం డబ్బు జనం కోసమే సబ్సిడీ ఇవ్వటం తప్పుకాదు. ఆర్టీసీ మోటారు వాహనాలపై పన్ను 68 కోట్లు ప్రతి ఏటా ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ఆర్టీసీని ఈ పన్నులనుంచి మినహాయిస్తే చాలా మేలు అవుతుంది.
       ఇక టైర్ల మన్నిక తమిళనాడు, మహారాష్ట్రంలో లక్ష కిలోమీటర్లు ఉంటే రాష్ట్రంలో 45 వేల కిలోమీటర్లు మాత్రమే ఉంది. రోడ్లను మరమ్మత్తు చేస్తే టైర్ల
 మన్నిక పెరుగుతుంది.
       ఆర్టీసీని ప్రజోపయోగ సంస్ధగా గుర్తించి అన్ని రకాల పన్నులనుంచి దానికి మినహాయింపు కల్పించాలి. దాని బడ్జెట్ లో ఏర్పడే లోటును సబ్సీడీ ఇచ్చి పూడ్చి వేయాలి.
       రోజూ 86 లక్షల ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు. ఛార్జీల భారాన్ని వీరిపై మోపవద్దు. ప్రయాణీకుల సౌకర్యం కోసం ఇతోధికంగా ప్రయత్నించాలి. టిక్కెట్టు పెంచినందుకు ఆర్టీసీని ప్రభుత్వాన్ని తిట్టకుండా ఉండేందుకు వాళ్ళను కనికరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను.



బస్సు ఛార్జీ పెంచారేమి ?
ఆంధ్రజ్యోతి 31-5-1990                                             నూర్ బాషా రహంతుల్లా
హైదరాబాద్


                పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తుఫాను తాకిడికి గురైన జిల్లాలలో వసూలు        చేయబోమని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాని మే 29 న నేను ఏలూరు     నుంచి భీమవరం వెళ్ళేందుకు ప్యాసింజర్ బస్సు ఎక్కితే 8-50 రూపాయిలు వసూలు చేశారు. అంతకు ముంది ఈ ఛార్జీ 7 రూపాయిలే వుండేది. ఈ        విషయమై కండక్టర్ ను అడిగితే ముఖ్యమంత్రి ప్రకటన మరునాడే       హైదరాబాదు నుంచి ఛార్జీలు పెంచాలని ఆదేశాలు వచ్చాయని చెప్పాడు.        తుఫాను బారిన పడి జనం మీద ముఖ్యమంత్రి గారికి ఏపాటి కనికరం       వుందో ఈ ఛార్జీల హెచ్చింపు నిరూపిస్తుంది.



రైలు చార్జీలు పెంపు
ఉత్తరప్రభ 23-3-1990                                              నూర్ బాషా రహంతుల్లా
హైదరాబాద్

ఎన్నో జన్మల పుణ్యఫలంగా మానవ జన్మ లభిస్తుందని, మరింత పుణ్యాత్ములకే ఈ కర్మ భూమిలో పుట్టుక సిద్దిస్తుందనీ మన శాస్త్రాల ఘోష. అనునిత్యం పెరిగిపోతున్న ధరలు, ద్రవ్యోల్బణం, అవినీతి, హింసలను చూస్తుంటే ఇక్కడ మన పుట్టుక పూర్వ జన్మల పాప ఫలితమేననిపిస్తున్నది. కాంగ్రెస్ నుండి దేశానికి విడుదల దొరికిందనే సంతోషాన్ని జనతాదళ్ ప్రభుత్వం నీరుగార్చింది. రైల్వే చార్జీలు పెంచటం, ఉద్యోగులకు కరవు భత్యం ఇవ్వటం దీనికి సూచనలు ?  రైల్వే చార్జీల పెరుగుదలను అడ్డం పెట్టుకొని రేపు మన రాష్ట్రంలో బస్సు చార్జీలను పెంచితే ఎవరూ అడ్డం చెప్పలేదు. ఈ రకంగా చార్జీలు పెరగటం తప్ప తగ్గటం ఎరగం. రుణాల మీద వడ్డీ, రక్షణ ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్నాయి. యుద్ధం పట్ల వైముఖ్యం పెరిగి వర్ధమాన దేశాలన్నీ శాంతిని కోరుకుని సామరస్యభావంతో ఉంటే రక్షణ కోసం పెట్టే ఖర్చు ఉత్పాదక అంశాలలోకి మళ్ళించవచ్చు. ధరల్ని తగ్గిస్తామంటూనే పన్నులు, చార్జీలు పెంచితే ధరలెలాతగ్గుతాయి ? జనతాదళ్ నేతలు తాము ఎంత తప్పు చేస్తున్నారో గ్రహించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి