ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

ఉద్యోగులు


ఎన్జీవో ఇక ఏదీ అడక్కూడదా?
'జనవాణి' ఆంధ్రభూమి   6-10-1989
              'ఎన్జీవోలు  బాగుపడితే రాష్ట్రం బాగుపడ్డట్టా ' అనే లేఖను అక్టోబర్     ఒకటిన ఆంధ్రభూమిలో చదివాను. ఈ లేఖ దగ్గేవాని దగ్గర డొక్కలు  ఎగురవేసినట్లుగా ఉంది.అసలే సమ్మెకాలం. 53 రోజుల జీతం రాక, కరువు బత్తెం చేతికందక, బోనస్, ఎక్స్ గ్రేషియా వంటి రాయతీలన్నింటికీ నీళ్ళొదులుకొని ఎన్జీవోలు ఉసూరుమంటూ ఉంటే వాళ్ళేమో అక్రమార్జన తో భాగ్యనగరంలో విపరీతమైన రాయితీలు పొందుతూ సౌభాగ్యవంతుల్లా విలాస జీవితాలు   గడుపుతున్నారని ఆ లేఖా రచయిత అసూయ చెందటం అసమంజసంగా ఉంది.
              పైగా ఎన్జీవోలకు వ్యవసాయ కూలీలను పోటీగా నిలబెట్టి వాళ్ళకిచ్చేవి  వాళ్ళకివ్వాలి అనటం అడుక్కుతినే వాడిదగ్గర గీరుకు తినేవాడి సామెతను గుర్తుకు తెస్తున్నది. వ్యవసాయం కూలీల సంక్షేమానికి ఎన్జీవోలు అడ్డం రారు. దేశంలోని బడుగు వర్గాలలో ఎన్జోవోలు కూడా ఒక భాగమే. అందరి  సంక్షేమాన్ని చూసేది రాష్ట్రం ప్రభుత్వం బాధ్యత. పేదలకోసం తెలుగుదేశం    ప్రభుత్వం 8 లక్షల పక్కా ఇళ్ళు కట్టించి దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.  అలాగే సంపన్నులైన ఎమ్మెల్యేలకు ఇళ్ళు కట్టించి ఇస్తున్నది. మధ్యలో  ఎన్జీవోలను మరచిపోయింది.మరి ఈ ఎన్జీవోలు నిరుపేదలుగానే స్వంత ఇల్లు లేక రిటైర్     అవుతుంటే రాష్ట్రం బాగుపడ్డట్టా? ఎన్జీవో ఇక ఏదీ అడుగకూడదా?

ఇదేం పద్ధతి         ఈనాడు 19-3-2003
              పంచాయితీ సెక్రటరీల పనితనాన్ని లెక్కించేందుకు 9 కరాల విధులకు  900 మార్కులిచ్చారు. అందులో భూమి శిస్తు వసూళ్ళకు కేవలం 20  మార్కులే కేటాయించారు. అంటే శిస్తు వసూళ్ళు మానేసి ఇతర వసూళ్ళు    చేసినా '' గ్రేడులో ఉండవచ్చు ఇదేం పద్ధతి?

సీనియర్లకు అన్యాయం


ఆంధ్రజ్యోతి 17-3-1985
                   తెలుగు గంగ ప్రాజెక్టులోనికి వివిధ ప్రాజెక్టులలోని మిగులు సిబ్బందిని 1983 లో తీసుకొని వచ్చారు. అయితే ఈ ప్రాజెక్టులోని అవకాశాలను ఇవ్వలేదు. ఎందుకంటే మిగతా సర్కిళ్ళలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎన్నో ఖాళీగా ఉంటే నెల్లూరు సర్కిల్లో మాత్రం ఖాళీలే లేవు.అందువలన నెల్లూరు సర్కిల్లోని జూనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్ వచ్చే అవకాశం లేదు. కాగా కేవలం రెండు మూడేళ్ళ సర్వీసు గల జూనియర్ అసిస్టెంట్లు కూడా  మిగతా సర్కిళ్ళ లో సీనియర్ అసిస్టెంట్లయ్యారు. సీనియర్లు నిలబడి ఉండగా జూనియర్లు ప్రమోట్ కావడం ఇక్కడే జరుగుతున్నది.ప్రాజెక్టును మినిస్టీరియల్ సిబ్బందికి సర్కిళ్ళు గా విడగొట్టడమే ఈ    అన్యాయానికి మూలకారణం. ప్రాజెక్టు మొత్తాన్ని ఒకే యూనిట్ గా పరిగణించి వారి సీనియారిటీని బట్టి అన్ని సర్కిళ్ళలోని వారిక్ ప్రమోషన్ అవకాశాలు కల్పించాలి.

సంకుచిత భావాల వల్ల ముప్పు
ఈనాడు 24-6-1986
                   రాయలసీమ ఉద్యోగులకు, తెలంగాణా ఉద్యోగులకు మన బోళాశంకరుడు ముందు వెనుక ఆలోచించకుండా వరాలిచ్చేశాడు. ఆమేరకు రాయలసీమలో పనిచేస్తున్న కొన్ని వందల మంది ఉద్యోగులకు   ఆంధ్రకు మళ్ళించారు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కాని ఇతర జోన్లలో పనిచేస్తున్న రాయలసీమ ఉద్యోగులను  రాయలసీమకు  పంపకూడదని సీమ ఉద్యోగనాయకులు పచ్చి స్వార్థంతో  వాదిస్తున్నారు.రాష్ట్ర ఎన్జీవో నాయకులమీద ఒత్తిడి తెస్తున్నారు. తలపెట్టిన బంద్   విఫలం కాగా నేడు సమ్మె చేస్తామంటున్నారు. ఇలాంటి సంకుచిత భావాల వల్ల రాష్ట్ర  సమగ్రత నాశనమవుతుంది. ప్రజల్లో వేర్పాటు భావాలు తలెత్తుతాయి. ఇది విశాలాంధ్ర.   ఇందులో ఉద్యోగులు ఎక్కడైనా స్వేచ్ఛగా    పనిచేసుకోవాలి.

మేలు చేసే మార్గమిదా?
ఈనాడు లేఖలు 9-5-1986
                   జంటనగరాలలోని ఎన్జీఓలకు ఇళ్ళ స్థలాలు కేటాయించడం కోసం     ప్రభుత్వం వెయ్యి ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. అయితే ఏ ఎన్జీఓ అయినా గృహ నిర్మాణం కోసం స్థలం పొందాలంటే నాలుగు షరతులు విధించారు.        ఉద్యోగి ఎన్జీఓ  సంఘ సభ్యుడై ఉండాలి. ఎన్జీఓ అసోసియేషన్ ప్రత్యేక    ప్రాతినిధ్యం కోసం పదిహేను రూపాయలు కట్టాలి. ఎన్జీఓల సంఘం అమ్మే     దరఖాస్తు ఫారం అయిదు రూపాయలు పెట్టి కాని దాంట్లోనే దరఖాస్తు చేయాలి. అప్లికేషన్లు సమర్పించుకోవడానికి చివరి తేదీ మే నెల పన్నెండో      తేదీగా నిర్ణయించారు. ఈ షరతులూ, వైఖరీ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.    నిజంగా అర్హులైన ఎన్జీఓలందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనే సత్సంకల్పం ప్రభుత్వానికి ఉంటే ప్రతి కార్యాలయంలో పనిచేస్తున్న ఇళ్ళ స్థలాలు పొందడానికి అర్హులైన వారి జాబితా తయారు చేసుకోవచ్చు. సర్వీసు  సీనియారిటీలను బట్టి క్వార్టర్లు ఇస్తున్నట్లుగానే ఇళ్ళ స్థలాలు కూడా    కేటాయించవచ్చు. సేకరించిన వివరాలను ఒక కంప్యూటర్ కు గనక అప్ప చెప్పినట్లయితే ఏ అవకతవకలకు ఆస్కారం లేకుండా కొద్ది వ్యవధిలో పని      సాఫీగా జరిగి పోతుంది. ఇళ్ళ స్థలాల పంపిణీ జరిగి పోతుంది. అంతే కాని ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్జీఓ సంఘాలకు అప్పజెప్పి తాంబూలాలిచ్చేశాం, తన్నుకు చావండి అన్నట్లుగా వదిలేస్తే అది సబబేనా? ఎన్జీఓ సంఘాల నాయకులు అడ్డమైన ఆంక్షలు విధించడం, తెలంగాణా ఎన్జీఓలను గాలికి వదిలేయడం మే నెలాఖరుకే స్థలాలిచ్చేస్తాను అన్నట్లుగా తేదీలు నిర్ణయించడం ఆశ్చర్యంగా ఉంది. కంచిలో చేయబోయే దొంగతనానికి   కాళహస్తి నుంచే ఒంగి నడిచినట్లుగా ఇదంతా ఏదో చిత్తశుద్ధిలేని వ్యవహారంలా కనబడుతోంది. ఇరవై యేళ్ళ సర్వీసు ఉండి కూడా ఎన్జీఓ సంఘంలో   సభ్యత్వం  లేకపోయినంత మాత్రాన ఇంటి స్థలం ఇవ్వనంటే ఎలా? విధాన నిర్ణయాలు తీసుకునే ముందు పాలకులు ఇటువంటి ఉచితానుచితాలను   ఆలోచించకపోతే అది భావ్యమేనా?

మరీ ఇంత అన్యాయమా ?
ఈనాడు 3-4-1985
                                                                                        
                   సీనియర్లను వదిలేసి జూనియర్లకు ప్రమోషన్ లివ్వడం   అన్యాయమని అందరూ అంగీకరిస్తారు కదా! రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలుగు గంగ ప్రాజెక్టులో జరుగుతున్నదదే. 1983 లో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల్లోని మిగులు సిబ్బందిని తీసుకువచ్చి తెలగు గంగ పథకం లో నియమించారు. అయితే అలా తీసుకువచ్చిన సిబ్బంది సీనియారిటీని బట్టి అన్ని సర్కిళ్ళలోను సమంగా నియమించాల్సి ఉంది. కానీ జరిగిందదికాదు. నెల్లూరు సర్కిల్ లోనే సీనియర్ అసిస్టెంట్లను నింపేశారు. అందువలన  మిగిలిన సర్కిళ్ళలో చాలా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉంటే   నెల్లూరు సర్కిల్ లో ఖాళీ లేవు. ఫలితంగా మిగిలిన సర్కిళ్ళలో రెండు  మూడేళ్ళ సర్వీసు గల జూనియర్ అసిస్టెంట్లు కూడా ప్రమోషన్లు పొందగలిగారు. నెల్లూరు సర్కిల్ లో మాత్రం ఎనిమిదేళ్ళ సర్వీసు ఉన్నవారు   కూడా జూనియర్లుగానే మిగిలిపోయారు. తెలుగు గంగ ప్రాజెక్టు మొత్తం ఒకటే  అయినప్పుడు వివిధ ప్రాంతాల మధ్య తారతమ్యం చూపడం ఎంత వరకు సమంజసం. ఆశ్రితులను అభిమానులను ఆదరించడానికి అపసవ్యపు  మార్గాలనవలంభించి అన్యాయానికి తలపడతారా?  

ప్రభుత్వం ఆలోచించాలి
ఆంధ్రప్రభ 1-1-1987
                   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు తమ మూల వేతనంలో 4 శాతం "భీమా" క్రింద చెల్లిస్తుంటారు. ఇది చెల్లించకపోతే ఇంక్రిమెంట్లు కూడా    మంజూరు చేయవద్దని ఉత్తర్వులు యిచ్చారు. అయితే ఇది చెల్లించడమే   గాని ఉద్యోగి తన భీమా మొత్తాన్ని తిరిగి తీసుకోగలిగిన సంధర్భాలు అతి తక్కువ. ఈ భీమా శాఖలోను, భీమావైద్య శాఖలోనూ మొత్తం 3,500 మంది  ఉద్యోగులు ఉన్నారు. వీరి జీత భత్యాలన్నీ కలిసి రాష్ట్ర ఉద్యోగులంతా కలిసి చెల్లించిన భీమా మొత్తంలో నాలుగవ వంతు అవుతున్నాయి. ఈ శాఖను ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి మేలూ జరుగలేదు. అందువలన పై నాలుగు శాతం చందా కూడా ప్రావిడెంటే ఫండ్ లోనే   జమచేసి, భీమా ఉద్యోగులందరినీ ఉద్యోగుల కొరతగా ఉన్న శాఖలకు  తరలిస్తే ప్రభుత్వానికి సుళువు అవుతుంది. జి.పి.ఎఫ్.ను ఎలాగూ ట్రెజరీలకు  అప్పగించే ఆలోచన ఉంది గనుక భీమా ఉద్యోగులను ట్రెజరీలకు బదిలీ     చేయవచ్చు. ప్రభుత్వం ఆలోచించాలి.

'ట్రాన్స్ ఫర్ డైజస్ట్' ప్రచురించాలి
ఆంధ్రజ్యోతి 4-10-1985
         చాలా కాలం నుంచి ఉద్యోగులు అక్రమ బదిలీలకు, తరచు బదిలీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అధికారులు తమ ఇష్టానుసారంగా తమకు నచ్చని వారిని బదిలీ చేసి దూర ప్రాంతాలకు పంపినపుపడూ న్యాయం కోసం ఉద్యోగులు కోర్టుల కెక్కి సంధర్భాలు అనేకం.ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే సంవత్సరం పొడవునా ఉద్యోగులు బదిలీ కోసం మొకపెడుతుంటారు. కొందరు తాము కోరుకున్న ఊరికి బదిలీ కారు. కొందరు బలాత్కారంగా నెట్టబడతారు. ఉద్యోగుల సంఘాలన్నీ ఈ   "బదిలీల సమస్య" ను పరిష్కరించే మార్గం ఇంతవరకూ కనుక్కోలేక  పోయాయి.   ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 'టెండర్ డైజస్ట్' పత్రిక ప్రచురిస్తున్నది. అలాగే వివిధ ప్రాంతాలకు, డిపార్టుమెంట్లకు బదిలీలు కోరుకునే ఉద్యోగుల కోసం 'ట్రాన్స్ ఫర్ డైజెస్ట్' నెలనెలా ఎందుకు ప్రచురించరాదు? జూనియర్ అసిస్టెంట్లు   అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులను వారి సొంత జిల్లాలకు ఎందుకు  పంపకూడదు? ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు ఈ విషయం ఆలోచించాలి.

ఎల్.టి.సి వద్దు
ఆంధ్రప్రభ 26-2-1989
                        రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబంతో రెండేళ్ళకోసారి   స్వగ్రామానికి వెళ్ళి వచ్చేందుకు అయ్యే ప్రయాణపు ఖర్చుల్ని ప్రభుత్వం  భరిస్తున్నది. దీనినే ఎల్.టి.సి (లీవ్ ట్రావెల్ కన్సెషన్)  అంటారు. అయితే ఈ సౌకర్యాన్ని రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా విహారయాత్ర జరిపేందుకోసం ఎన్జీవోలకు కలిగించాలని ఉద్యోగుల నాయకులు కోరుతున్నారు. ఎల్.టి.సి. బిల్లులో 70 శాతం వరకు దొంగ బిల్లులే దర్శనమిస్తున్నాయి. ప్రయాణం     చెయ్యకుండానే ఫస్టు క్లాసు చార్జీలను ప్రభుత్వం నుండి రాబట్టుకుంటున్న సంఘటనలు కొల్లలుగా ఉన్నాయి. డబ్బు అవసరమే ఇలాంటి పాడు పనులకు ఉద్యోగులను ప్రేరేపిస్తున్నది లంచగొండితనం కూడా ఎక్కువ     అవుతున్నది. అక్రమాలకు దారితీసే ఇలాంటి కోర్కెలు కోరే కంటే ఎన్జీవోల ఇళ్ళు, ఎకోగ్రేషియా లాంటి కోర్కెలు కోరటం మంచిదని ఎన్జీవో నాయకులు   గుర్తించాలి.

ఎన్జీవోలకు ఇళ్ళు-హుళక్కేనా!
ఈనాడు 29-4-1989
                   రిటైర్ అయ్యేలోగా ప్రతి ఎన్జీఓకూ స్వంత ఇంటిని సమకూరుస్తానని శ్రీ  రామారావు 1983 ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ మేనిఫెస్టోలో  వాగ్ధానం చేశారు. అదే 1988 నాటి కల్లా ఎన్జీఓ లకు 'పదివేల ఇళ్ళు నిర్మిస్తాం'   అనే స్థాయికి వాగ్ధానం దిగజారింది. ఈ ఏడు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ఎన్జీఓల ఆశలు తీరుస్తానని తెగ ఊరించి చిట్టచివరకు ఇళ్ళ విషయమై ఒక కమిషన్ వేస్తామంటూ ముఖ్యమంత్రి మాట మార్చేసరికి  బడుగు జీవులు ఉసూరుమన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న  చందంగా ఉన్న ఎన్జీఓలకు కనీసం ఇళ్ళ స్థలాలైనా ఇవ్వక అయిదేళ్ళ పాటు శాసనసభ్యులుగా ఉండి (అదీ అనుమానమే) ఆ పిమ్మట భవిష్యత్తు  అగమ్యగోచరమైన ఎమ్మెల్యేలకు అడిగిందే తడవుగా ఇళ్ళు కట్టించి ఇస్తామని ప్రకటించడం వింతగా ఉంది.

ఎ.వి.ఎస్.తిరకాసు!
ఆంధ్రజ్యోతి 16-10-1986
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఐ.ఎ.ఎస్ అధికారి శ్రీ   ఎ.వి.యస్. రెడ్డి నేను మాజీ సైనికోద్యోగుల అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వాన్ని దుయ్య బట్టాను గాని ప్రభుత్వోద్యోగిగా కాదు అని డొంక తిరుగుడుగా వాదించటం బాగా లేదు.  రెండు పదవులు నిర్వహిస్తున్న మనిషి ఒక్కడే. ఆయనకున్న మేధస్సు ఒక్కటే. ఆ తలలో భావాలను మొలకెత్తించే మెదడూ ఒక్కటే. అవును నేనే విమర్శించాను.   ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే విమర్శించాను అది తప్పా?”  అని కోర్టు కెక్కి  ఉంటే, ప్రభుత్వోద్యోగుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే కాండక్ట్ రూల్స్       రాజ్యాంగ విరుద్ధమని సవాలు చేసి ఉంటే, ఆయన భారతీయ ఉద్యోగులకు బ్రిటిష్ చట్టాల నుంచి విముక్తిని, స్వేచ్ఛను కలిగించడంలో  ఉపయోగపడేవాడు. భావ ప్రకటన ఉద్యోగి ప్రాధమిక హక్కు. దాన్ని   రక్షించాలి అని అరుస్తున్న రెడ్డి గారు ఒక ఉద్యోగి హోదాలోనే ప్రభుత్వంలో  తలపడి కోర్టు కెళ్ళినట్లయితే బాగా ఉండేది. మాజీ సైనికుల్ని అడ్డం పెట్టుకోవడం వల్ల అసలు ఉద్యోగి భావ ప్రకటనా స్వేచ్ఛ అనే సమస్య  గజిబిజిగా తయారయ్యింది. ఇప్పుడు రెడ్డి గారి పోరాటం ఎందుకో ఎవరికీ   అడ్డం కావటం లేదు.

అప్రతిష్టపాలు చేస్తున్న అధికారులు
జనవాక్యం
ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు  అధికారులు ప్రయత్నిస్తున్నారేమోనని శ్రీ చెన్నారెడ్డి వెలిబుచ్చిన సందేహం అక్షరాల నిజం. వాస్తవానికి మంత్రుల విద్యావిహీనతను ఆసరాగా చేసుకుని   అధికారులు తమ స్వంత భావాలను ఫైళ్ళలో వ్రాసి ఆమోదింప జేసుకున్న   ఉదాహరణలు కొల్లలు. మంత్రులకు చట్టాలలోని నియమ నిబంధనలను     తెలియజెప్పే బాధ్యత కూడా అధికారులదే. అయితే ఈ మంత్రులకు చట్ట పరిజ్ఞానం తక్కువ గనుక అధికారులు అడ్డగోలుగా జీవోలు తయారుచేసి    ఆమోదం పొందుతున్నారు. జులై 12 వతేదీన జారీ చేసిన జీవో నంబర్ 236 చేరేవారికి బేసిక్ పే తప్ప అలవెన్సులు ఏమీ ఇవ్వకూడదని ఆ జీ.వో.  నిర్దేశిస్తున్నది. దీన్ని గురించి ఆర్ధిక మంత్రిని అడిగితే అసలా జీవో సంగతే నాకు తెలియదని అమాయకత్వం ప్రదర్శించాడు. అంటే సచివాలయంలోని  ఐ.ఎ.యస్. అధికారులు ప్రభుత్వాన్ని గబ్బు పట్టించే జీ.వోలు విడుదల  చేస్తున్నారన్నమాట.

వారంలో రెండు రోజులు సెలవులా?
ఆంధ్రప్రభ 14-5-1985
ప్రభుత్వ  కార్యాలయాలు వారంలో ఆరు రోజులు పనిచేస్తుంటేనే  కాగితాలు, ఫైళ్ళు కదలటం అంతంత మాత్రంగా ఉంది. ఏపనికైనా విపరీతమైన జాప్యం తప్పటం లేదు. అటువంటిది వారంలో ఐదు రోజులు మాత్రమే కార్యాలయాలు పనిచేస్తే ఎంత చక్కగా ఉంటుందో వేరే చెప్పాలా?

జాతీయ వేతన విధానం అవసరం
            ప్రభుత్వ  రంగ సంస్థలలోని ఉద్యోగులతో సమంగా జీతాలు కావాలని  కేంద్ర ప్రభుత్వోద్యోగులు గోల చేస్తుంటే, కేంద్ర ఉద్యోగులతో సమానంగా   జీతాలిమ్మని రాష్ట్ర ఉద్యోగులు అడుగుతున్నారు. సమాన పనికి సమాన  వేతనం  ఇవ్వండని సుప్రీం కోర్టు చెప్పినా కేంద్ర ప్రభుత్వం పాటించడం లేదు. చతుర్వర్ణం మయాసృష్ట్యాం అన్నట్లు ఇన్ని రకాల ఉద్యోగులు వారి మధ్య   అంతరాలు అలా ఉండాల్సిందేనని చెబుతూ జాతీయ వేతన విధానం”  అమలులోకి రాకుండా అడ్డు కొంటున్నది. దక్షిణాది రాష్ట్రల కంటే మన రాష్ట్రం  లోని జీతాలు హెచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నది. ఆంధ్ర వాళ్ళకు జీతాలు ఎందుకు ఎక్కువ రావాలి అని మిగతా రాష్ట్రాల ఉద్యోగులు ఉద్యమాలు లేపవచ్చు. ఇలా ఒకరినొకరు పోల్చి చూచుకోవాల్సిన   దురదృష్టం కేంద్రప్రభుత్వం వల్లనే కలిగింది. పన్నుల రూపంలో వచ్చిన  ఆదాయమంతా గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రల మొహాన ఇంత విదిలిస్తున్నది.   కేంద్రం తన ఉద్యోగులకు ముందూ వెనుక చూడకుండా వేతనాలు    పెంచుతుంది. కరువు భత్యాలిస్తున్నది. 

సమ్మె చేసినా కోపం వద్దు
సమ్మెలో పాల్గొనే పర్మినెంటు ఉద్యోగులు తాత్కాలిక ఉద్యోగులను బలవంతంగా దింపుతారు. వారిని విధులకు హాజరు కానివ్వరు. తాత్కాలిక   ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి, తమ సర్వీసు వ్యవహారాలలో సైతం  పర్మినెంటు ఉద్యోగులపైనే ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి వారిని ఎదిరించి విధులకు హాజరు కాలేరు. అయితే ఈ వాస్తవాలను గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం సమ్మెలో పాల్గొన్నారనే నెపంతో తాత్కాలిక ఉద్యోగులను డిస్మిస్  చేయాలని చూడటం క్షమా గుణాన్ని ప్రతిబింబించడం లేదు. తాత్కాలిక ఉద్యోగులు నిజంగా నిస్సహాయులు. అడకత్తెరలో పోక చెక్కల్లాగా నలిగేవారు. సమ్మెలో ఒక వేళ ఉద్యోగులు విజయం సాధించినప్పటికీ  తాత్కాలిక ఉద్యోగులకు సెలవు సదుపాయం ఉండకపోవడం వలన జీతం    నష్టపోవలసి వస్తుంది.

సలహా
ఉదయం 12-12-1986
కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 80 రకాల పే స్కేళ్ళను 30 పే  స్కేళ్ళుగా రీ గ్రూపు చేసి కొత్త వేతనాలిచ్చింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీతాలు కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా లేనని ఎన్జీవోలు వాదిస్తున్నారు. 'సమాన పనికి సమాన వేతనం' అన్న సూక్తిని బట్టి కేంద్ర  ప్రభుత్వ పే స్కేళ్ళను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కూడా యథాతధంగా అమలు పరిస్తే ఆందోళనకు తావుండదు. సమానత్వం సిద్ధిస్తుంది. ప్రభుత్వం ఆలోచించాలి.

ఘన విజయం   ఆంధ్రపత్రిక 6-4-1985
బ్రిటిష్ వారి కాలంలో ప్రారంభించబడి ఈనాటి వరకు ఎన్జీవోల   మెడకు గుదిబండలాగా ఉంచబడిన కాన్పిడెన్షియల్ రిపోర్టులను శ్రీరామారావు గారు రద్దు చేస్తూ జీ.వో జారీ చేయడం చాలా ఆనందించదగిన విషయం. ఎన్జీవోలకు ఇది ఘన విజయం. ఇలాంటి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ఎన్జీవో నాయకులను, ఆమోదించిన రామారావు గారిని నేను అభినందిస్తున్నాను.

ఎన్నికల ప్రణాళిక అమలు కాకపోతే...?
ఆంధ్రప్రభ  28-10-1989
నేషనల్ ఫ్రంట్ ఎన్నికల వాగ్ధానాలలో పని హక్కు తెలుసుకునే  హక్కు, పంచాయితీలకు ప్రాణం పోయటం, పది వేల రూపాయల దాకా రుణాల మాఫీ, భూసంస్కరణల అమలు మొదలైన గొప్ప విషయాలున్నాయి. అయితే ఇతర పార్టీలు ఇంత కాలం చేస్తూ వచ్చిన వట్టి  వాగ్ధానాలలాగానే, ఇవి కూడా అమలు కాకపోతే జనం ఏం చెయ్యాలి?   ఉదాహరణకు తెలుగుదేశం మేనిఫెస్టోలో ఎన్జీవో రిటైర్ అయ్యే నాటికి సొంత  ఇల్లు వాగ్ధానం చేశారు. కాని రిటైర్ అయిన ఎన్జీవోల సంక్షేమం పట్టించుకోకపోగా, ఉద్యోగుల మీద పగబట్టిన రీతిలో ఆ పార్టీ వ్యవహరించింది. ఉద్యోగులూ జనం ఏమీ చేయలేకపోయారు. లోకాయుక్తి పరిధి నుండి ముఖ్యమంత్రిని తప్పించటం, నాయకుల ఆస్తుల వివరాలు సీల్డ్ కవర్లలోదాచి ఉంచటం, భూసంస్కరణలను అమలు చేయకపోవటం వంటి     విషయాలలో ప్రజలు ప్రేక్షకుల్లా ఉండిపోవాల్సి వచ్చింది. అందువలన ప్రతి    పార్టీ తన వాగ్ధానాల పత్రాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేసి కోర్టుకు జవాబుదారీ కావాలి. ఎన్నికల వాగ్ధానాల కాంట్రాక్టును నెరవేర్చలేకపోతే శిక్ష  అనుభవించాలి. ఇకపై ఎన్నికలకు వారు అనర్హులు అని కోర్టు ప్రకటించాలి.
ఎదుగూ బొదుగూ లేని బ్రతుకు
ఉత్తరప్రభ 13-2-1985
వెనుకటి రోజుల్లో బ్రతుక లేక బడిపంతులు అనేవారు. ఇప్పడు గతిలేక గుమాస్తా ఉద్యోగం అంటున్నారు. ఎందుకంటే, 1978లో ప్రభుత్వం ఉపాధ్యాయులు, గుమాస్తాల జీతాలలో వ్యత్యాసాలు కలిగించింది, అంతకు పూర్వం ఇద్దరికి అగ్రశ్రేణి వారికి మూల వేతనం రూ.320, ఉండగా, దానిని  ఉపాధ్యాయులకు రూ. 575 లకూ, ఉపాధ్యాయేతరులకు రూ.550 లకూ పెంచింది. 1982 డిసెంబరు లో ప్రభుత్వం ఉపాధ్యేయేతర సిబ్బంది జీతాలు అలాగే ఉంచి, ఉపాధ్యాయుల వేతనాల స్కేళ్ళు సవరించింది. అందువల్ల ఉపాధ్యాయేతర కనీస మూలవేతనాల రూ. 290 లు ఉండగా,ఉపాధ్యాయుల కనీస మూలవేతనం రూ. 530 లకు పెరిగింది.అంతేగాదు, ఒక సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు బి.ఇ.డి చదివితే అతనికి బి.ఇ.డి. స్కేలు ఇస్తున్నారు. కానీ, ఒక సీనియర్ అసిస్టెంట్ ఎం.ఎ  చదివినా అతనికి పై స్కేలు ఇవ్వడం లేదు.వ్యత్యాసాల  నివారణకు ప్రభుత్వం నియమించిన రాఘవేంద్రరావు    కమిటీ 1.2.84 న నివేదికలు పంపమని ఉద్యోగ సంఘాలను కోరింది. 23.3.1984 వరకు నివేదికలు అందలేదు. ఆ కమిటీ గడువు 23.7.1984 వరకు   పొడిగించింది. నాటికీ నేటికీ ఆ కమిటీ నివేదిక సమర్పించిందో లేదో తెలియడం లేదు. ఉపాధ్యాయులు కష్టపడి సాధించుకొన్నారు. ఉపాధ్యాయులు సాధించుకోలేకపోయారు. వీళ్ళు ఇద్దరూ చీలి ఉండడం ప్రభుత్వానికి   ఎప్పుడూ సంతోషమే కదా! ఇంతకు ఎవరిని అని ఏమీ లాభం ? తేడాలు అలాగే ఉన్నాయి.

ఎంత తేడా?
ఆంధ్రప్రభ 20-11-1987
దీర్ఘకాలం ఒకేచోట ఉద్యోగం చేయనిస్తే ఉద్యోగులు ఆ ఊళ్ళో వేళ్ళు, ఊడలు పాతుకొనిపోయి అవినీతిపనులు చేయడానికి జంకరు. ఎందుకంటే   అక్కడినుండి బదిలీ అనేదే ఉండదు గనుక. లే అవుట్లుపరిశీలించకుండానే   కట్టడాలకు పర్మిషన్ ఇచ్చి సస్పెండ్ అయిన హైదరాబాద్ మునిసిపల్   అధికారులే ఇందుకు నిదర్శనం. వీళ్ళను రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లకు బదిలీ చేసే చట్టం  ప్రభుత్వం తెస్తే వీరు వ్యతిరేకిస్తున్నారు. తమ జీవితాంతం రాజధాని నగరంలోని ఉండాలని కోరుకుంటున్నారు. ఫలానా చోట పని  దొరుకుతుంది అంటే పొట్ట చేతపట్టుకొని అక్కడికి తరలి వెళ్ళే కూలీలకు ఈ    అధికారులకు ఎంత తేడా?

ఉద్యోగుల్లో ఉత్సాహం ఉండాలంటే...
ఈనాడు లేఖలు 30-10-1990
ప్రభుత్వ కార్యాలయాలకు అయిదు రోజుల పని-వారం ప్రవేశపెట్టాలన్న ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి ఆలోచన అభివృద్ధి నిరోధకం. ఉపాయం చెప్పవయ్యా అంటే ఉరితాడు తెచ్చుకోమన్నట్లుగా ఉంది. ఆయన ధోరణి, ఆరు రోజుల్లో చేయలేని పనులను అయుదు రోజుల్లోనే ఎలా చేయించగలరు ? ఆఫీసుల్లో పనులు త్వరగా జరగకపోవడానికి కారణం అధికార వికేంద్రీకరణ జరుగకపోవడమే. సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగులందరికీ గెజిటెడ్ హోదా కల్పించి చూడండి. పనులు ఎంత చకచకా జరుగుతాయో ! బడుగు ఉద్యోగులకు అసలైన ఉత్సాహం సెలవులవల్ల రాదు. వారికివ్వాల్సిన బోనస్, కరవు భత్యం, మెడికల్ అలవెన్సులు సక్రమంగా ఇస్తుంటే వస్తుంది. ఉద్యోగుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు చేపట్టకుండా, సెలవులతో సంతృప్తి పరుద్దామనుకోవడం అన్యాయం.

పంచాయితీ, రెవిన్యూ శాఖల విలీనం
ఆంధ్రప్రభ 8-2-1989
గ్రామ పంచాయితీలకు ఆర్థిక పుష్టిని, మరిన్ని అధికారాలను  ఇవ్వాల్సిన అవసరం ఉందని అటు శ్రీ రాజీవ్ గాంధీ, ఇటు శ్రీ రామారావు  ఇద్దరూ అభిప్రాయపడ్డారు. మన దేశంలో 1980 నాటికే 5 లక్షల 95 వేల   గ్రామాలు ఉండగా వీటిలో 2 లక్షల 12 వేలు గ్రామ పంచాయితీలు. ఈ    గ్రామాల జనాభా 46 కోట్లు ఉన్నది. వీటిలో 35 కోట్ల ప్రజానీకానికి సొంత     భూమి ఏమీ లేదు. వీరంతా వ్యవసాయ కూలీలు. ఇక మన రాష్ట్రంలో 27,379        గ్రామాలుండగా వీటిలో 19,580 పంచాయతీలు ఉన్నాయి. 1091  మండల   ప్రజా పరిషత్తులు 1104 రెవిన్యూ మండలాలున్నాయి. పంచాయితీ పరిపాలన బాగుపడాలంటే మండల ప్రజాపరిషత్తుల సంఖ్య రెవిన్యు      మండలాలతో సమానం చేసి పంచాయితీరాజ్ రెవిన్యూ శాఖలను విలీనం చెయ్యాలి. ప్రతి గ్రామ పంచాయితీలో ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి అధికారులు, ఎగ్జిక్యూటివ్ అధికారులు నివసించటానికి ఇళ్ళు, పంచాయితీ   కార్యాలయ భవనాలు నిర్మించాలి. ఎగ్జిక్యూటిన్ అధికారులను గెజిటెడ్ ఆఫీసర్లుగా మారిస్తే అధికార వికేంద్రీకరణ జరిగి, ప్రజలకు పరిపాలన  సౌకర్యాలు చేరువౌతాయి.
రెవిన్యూ సిబ్బంది వెట్టి చాకిరి ఎన్నాళ్ళు ?
ఈనాడు లేఖలు 15-9-1990
మండల స్థాయిలో రెవిన్యూ సిబ్బంది వెట్టి చాకిరికి గురవుతున్నారు. మధ్యయుగాల నాటి బానిస వ్యవస్థ ఇంకా గతించలేదా అనిపిస్తోంది. పని భారం అధికమై ప్రభుత్వ హడావిడి నిర్ణయాలను  అమలు చేయడంలో రేయింబవళ్ళు శ్రమిస్తున్నా పనికి తగ్గ ఫలితం వీరికి దక్కడం లేదు. జిల్లా అధికారులు ధూషణలే వీరికి రివార్డులు అవుతున్నాయి. రేషన్ కార్డుల జారీ కాని, ఏరివేత కాని కులధృవీకరణ పత్రాల మంజూరు కాని ఆర్. ఒ. ఆర్ పనులైతేనేమీ ఇలా రకరకాల పనులు, శిస్తు వసూళ్ళు లక్ష్యాన్ని చేరకుంటే కష్టం. పంచనామాలు, జనాభా లెక్కలు సరే సరి.

రెవిన్యూ సిబ్బంది సేవలు
ఈనాడు 22-5-1990
తుఫాను బాధితులకు సహాయం పంపిణీ చేయటంలో రెవిన్యూ సిబ్బంది ఎంతో కృషిచేస్తున్నారు. వీరు అవినీతిపరులని, లంచగొండులని జనం సాధారణంగా అసహ్యించుకొంటూ ఉంటారు. కాని ఇటీవల వారు చేసిన సహాయ కార్యక్రమాలు చూశాక అభినందించకుండా ఉండలేము.

ఉద్యోగులకు సొంత ఇళ్ళు
ఆంధ్రప్రభ 29-7-1990
ప్రభుత్వ భూముల్ని మార్కెట్ రేటుకు వివిధ సహకార గృహ నిర్మాణ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకుఅమ్మటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనాడు 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు గ్రామస్థాయి నుండి రాజధాని నగరం వరకు విస్తరించి ఉన్నారు. వీరికి గృహ నిర్మాణం కోసం ప్రతి మండల,జిల్లా కేంద్రాలలో భూముల్ని కేటాయించవలసిన అవసరం ఎంతో ఉంది. గ్రామాలలో కూడా గ్రామోద్యోగుల కోసం క్వార్టర్లు నిర్మించాలి. ప్రతి మండల కేంద్రంలో అద్దె కొనుగోలు పద్ధతి మీద ఉద్యోగులకు ఇళ్ళు కేటాయించాలి. పేద ప్రజలకు పక్కా ఇళ్ళ కార్యక్రమం ఆగిపోయింది. సంవత్సరానికి లక్ష ఇళ్ళ చొప్పున పక్కా ఇళ్ళు కట్టించి ఇస్తేనే 2000 సంవత్సరం నాటికి మన ప్రజలందరికీ ఇల్లు ఆశయం నెరవేరుతుంది. ఇళ్ళ నిర్మాణంపై పెట్టిన పెట్టుబడి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది వేస్తుంది.


ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు
ఈనాడు 28-8-1990
 రాష్ట్ర రాజధాని నగరంలోని ఎన్జీవోలకు ఇళ్ళ స్థలాల కోసం 400 ఎకరాలు కేటాయించడం హర్షదాయకం. అలానే ప్రతి జిల్లా కేంద్రంలోను వందేసి ఎకరాల చొప్పున జిల్లాల ఉద్యోగుల ఇళ్ళ కోసం కేటాయిస్తే బాగుండేది. ప్రస్తుతం జిల్లాలలో 4 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, మరో 4 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 70 శాతం మందికి సొంత ఇళ్ళు లేవు. ఉద్యోగికి అయిదు సెంట్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల ఎకరాల స్థలాన్ని ఇవ్వవలసి వస్తుంది. కేవలం ఎన్జీవోలకు మాత్రమే ఇవ్వదలిస్తే 14 వేల ఎకరాలు కావాలి. అందువల్ల ప్రతి జిల్లా కేంద్రంలోను వంద ఎకరాలు కేటాయిస్తే కనీసం లాటరీ పద్ధతిలోనైనా సగం మందికి ఇళ్ళ స్థలాలు లభిస్తాయి. రెండు వేల సంవత్సరం నాటికి అందరికీ ఇళ్ళు కల్పించాలనే ప్రభుత్వ ఆశయం సఫలం కావాలంటే గృహ నిర్మాణాలపై ప్రభుత్వ పెట్టుబడి పెరగాలి.

VIP expenses
Indian Express  6-12-1994       
              The ACB has filed a case against a retired MRO (Eluru) for receiving a Rs. 400 bribe. But it had closed its eyes when the same MRO spent thousands of rupees toward hospitality to VIPs who came for the ‘praja sadassu’.The revenue and police people spent much from their own pockets on the VIPs for the PM’s Narsapur meeting.No VIP spends his own money. How can the ACB expect righteousness in officers?

ఉన్నతాధికార్ల సేవలు సద్వినియోగం
ఈనాడు 2-7-1994
రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్లకు మధ్య వారధిగా వ్యవహరించడానికి, ఆయా జిల్లాల అభివృద్ధిని సమీక్షించేందుకు కమిషనర్ స్థాయి గల ఏడుగురు ఐ.ఎ.ఎస్. అధికారుల్ని నియమించారు. కాని వారి సేవల్ని సక్రమంగా వినియోగించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్లకు, భూమిశిస్తు కమిషనర్ కు మధ్య జోనల్ అధికార్లు లేరు. జోనల్ పరిధిలో ఉద్యోగుల సాధకబాధకాలను చూసేందుకు ప్రాంతీయ అధికారులుంటే బాగుంటుంది. జోనల్ స్థాయిలో జరగాల్సిన ప్రతి చిన్న పనికీ ఉద్యోగులు హైదరాబాద్ కు పరుగు తీయాలంటే ఎంత కష్టమో ఆలోచించాలి. కాబట్టి ఈ ఏడుగురికీ ప్రాంతీయ కమిషనర్ కార్యాలయాలను సంబందిత జోన్లలో ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలు తీర్చాలి. ఉన్నతాధికార్ల సేవలను సద్వినియోగం చేసుకుని సమన్యయం సాధించాలి.


ఎమ్మార్వోలకు గెజిటెడ్ హోదా
ఈనాడు 17-5-1994
రాష్ట్రంలోని రెవిన్యూ అధికార్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. బాధ్యతలను ఎడాపెడా పెంచేస్తున్నారు గాని వారి స్థాయిని మెరుగుపర్చాలన్న ఆలోచన రాకపోవడం శోచనీయం. రాష్ట్రంలో 1864 మంది డిప్యూటీ తహశాల్దార్లున్నారు.  వీరికి ఇంతవరకు జోనల్ సీనియారిటీ లిస్టులు తయారు చేయలేదు. వీరిలో 734 మంది మండల రెవిన్యూ అధికార్లుగా పనిచేస్తున్నారు. మండల అభివృద్ధి అధికార్లందరికీ గెజిటెడ్ హోదా కల్పించిన ప్రభుత్వం ఎమ్మార్వోల పట్ల విచక్షణ ప్రదర్శిస్తోంది. అధికార వికేంద్రీకరణ పేరుతో మండలాలను ఏర్పాటు చేసి పనిభారం పెంచినా ఎమ్మార్వోల స్థాయి పెంచకపోవడం అన్యాయం. పాలనాపరంగా కీలక విధులు నిర్వర్తించే అధికార్లకు గెజిటెడ్ హోదా కట్టబెట్టాలి.

ఎమ్మార్వోలకూ గెజిటెడ్ హోదా
ఈనాడు 13-11-1992
రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఎం.డి.ఒ.లు గెజిటెడ్ హోదా కలిగి ఉన్నారు. కానీ ఎమ్మార్వోలందరికీ ఆ హోదా లేదు. ఎమ్మార్వోలు గెజిటెడ్ అధికారులతో సమానంగా, అన్ని విధులూ నిర్వహిస్తునప్పుడు వారికి ఆ హోదా కల్పించకపోవడం అకారణంగా వారిని చిన్నబుచ్చడమే. ఒకే విధమైన బాధ్యతలు, నిర్వహించే వారు సమాన హక్కులు కోరడం సమంజసమే. అధికార వికేంద్రీకరణ నినాదాన్ని నిజం చెయ్యాలంటే మండల రెవిన్యూ  అధికారులందరికీ గెజిటెడ్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అవసరం.


కంప్యూటర్లతో పాటు వ్యవస్థా మారాలి
ఈనాడు 8-5-1995
రెవిన్యూ శాఖను కంప్యూటరైజ్ చేస్తామని ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. ఆలస్యమైనా కీలక పాలనా శాఖ పట్ల తమ కర్తవ్యాన్ని ఏలికలు గుర్తించడం ముదావహం. ఇక ఇప్పట్నుంచే ఉద్యోగులకు దశల వారీగా కంప్యూటర్ల నిర్వహణలో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది. కంప్యూటర్ల కొనుగోలులో కక్కుర్తి పడకుండా బహుళ ప్రయోజనకరమైనవే ఖరీదు చేయాలి. అంకెలు, లెక్కలు మాత్రమే గాక గ్రామాల మ్యాప్ లు, సర్వె స్కెచ్ లు ఇతరత్రా అంశాలు చూపించగలిగే వాటిని కొనడం అవశ్యం. కేవలం కంప్యూటర్లు కొంటే లాభం లేదు. వాటిని సమర్ధంగా వినియోగించుకునేలా యంత్రాంగాన్నీ మార్చాలి. సర్వే డిపార్ట్ మెంట్ ను, పంచాయితీ రాజ్ శాఖను 'రెవిన్యూ' లో విలీనం చేస్తే సమాచార సమన్యయం పెరుగుతుంది. గ్రామ పాలనాధికార్లకు బదిలీ ప్రాతిపదిక అమలు చేసి పల్లె నుంచి జిల్లా దాకా సమాచార ప్రసారాన్ని వేగిరం చేయాలి. కలెక్టరేట్ లను ప్రక్షాళన చేసి పరిపాలనలో స్తబ్ధత తొలగించాలి.

చేదు రుచులు
-- నూర్ బాషా రహంతుల్లా, ఆంధ్రప్రభ 3-1-1987
సమ్మె చేదురుచులుఅనే సంపాదకీయంలో ఉద్యోగులకు కనువిప్పు కలిగించే అనేకఅంశాలుప్రస్తావించారు. ఉద్యోగులు వాటిని తీవ్రంగా ఆలోచించాలి. ఒక్క విషబిందువు కడివెడు పాలనుకలుషితం చేసేటట్లు ఒక్క లంచగొండి, ఒక్క అవినీతి వరుడు మొత్తం కార్యాలయానికి చెడ్డపేరు తీసుకురాగలడని, అతడిని సహ ఉద్యోగులే అదుపులో ఉంచాలనిసూచించారు.కానీ సహోద్యోగులు అలా చేయలేరు.కడివెడు విషంలో ఒక్క పాలబిందువు కలిసి విషమై పోయినట్లు నేటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే లంచం బాగా వచ్చే అవకాశం ఉన్న ఉద్యోగాలనే నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ఒకడో ఇద్దరో సదాశయాలతో ఉద్యోగంలో కాలిడితే వారిని బలత్కారంగా లంచగొండుల్ని చేస్తున్నారు. లంచగొండి కాని వాడిని శత్రుదేశం వాడిలా చూసి శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు.అవినీతి వ్యవస్థ వర్థిల్లాలనిఐ.ఎ. యస్. ఆఫీసర్లు మొదలు అటెండర్ల వరకు మెజారిటీ ఉద్యోగులు కోరుకుంటున్నారు.ఎందుకంటే వారికి పోస్టింగ్ రావటానికి కూడా రాజకీయనాయకుల ఉత్తరమో,దక్షిణమో సమర్పించకతప్పటంలేదు.మరి పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవటం ఎలా?

పే అండ్ అకౌంట్స్ ఆఫీసులో లంచగొండుల జేబులు వెతికినందుకు అవినీతి నిరోధక శాఖ మీద ఆ ఉద్యోగులు తిరగబడ్డారు. ప్రభుత్వాన్ని తిట్టిపోశారు.ఆవినీతి పరులైన ఉద్యోగుల్ని పట్టుకొని శిక్షిస్తే ఉద్యోగసంఘాల వాళ్ళు వ్యతిరేకించకూడదనిప్రభుత్వం సమ్మె చర్చల్లో ఒక షరతు ఉద్యోగ నాయకుల ముందు ఉంచింది. ఆ షరతును ఆహ్వానించవలసింది పోయి, ఆ షరతును ఉపసంహరించుకోమని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.దీని అర్ధం ఏమిటి ? ప్రభుత్వమూ ప్రజలు కూడా ఉద్యోగులు లంచగొండులు సోమరిపోతులని చీదరించుకొంటుండగా, నిజాయితీ ఉంటే ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలన్నీ లంచగొండి తనానికి వ్యతిరేకంగా ఒక శపథంచేయాలి. నిజాయితీగా పనిచేస్తామని ప్రతిజ్ఞచేయాలి. దానికి తగినట్లుగా తమ ప్రవర్తన తీర్చి దిద్దుకోవాలి.

చాలీచాలని జీతాలే అవినీతికి కారణంఅని కేంద్ర చీఫ్ విజిలెన్స్ అధికారి శ్రీ అగర్వాల్ అన్నారు. ప్రభుత్వం బడుగు ఉద్యోగుల జీతాలు పెంచాలన్నారు. అయితే ఎక్కువ జీతాలు వస్తున్న ఆఫీసర్లు కూడా మరింత అవినీతికి పాల్పడుతున్నారు. సెక్రటరీలు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, డాక్టర్లూ వీళ్ళంతా పేద వాళ్ళు కాదు. రాజకీయ నాయకులు కూడా ఈ పాపంలో పెద్ద వాటా పంచుకుంటున్నారు”. ధనాపేక్ష సమస్త కీడులకూ మూలంఅనే సూక్తిని నిజం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు లంచగొండి అధికారుల్ని, నాయకుల్నీ పట్టించాల్సిందే.
గత ప్రభుత్వ తప్పిదం సరిదిద్దాలి
21-12-1994
తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి రాగానే గ్రామాధికార్ల వ్యవస్థను రద్దు చేసి ప్యూడల్ వ్యవస్థను కూల్చి వేసింది. కాంగ్రెస్ ప్రార్టీ అధికారంలోకి వచ్చాక పాత వ్యవస్థను కొత్త రూపంలో పాక్షికంగా ప్రతిష్టించింది. ఇప్పుడున్న గ్రామ పాలనాధికార్లు ఎమ్మార్వోలకు లోబడి పనిచేయడం లేదు. ప్రజల అవసరాలకు స్పందించడంలేదు. పార్ట్ టైమ్ ఉద్యోగం, పైగా బదిలీ లేకపోవడంతో స్థానిక బలంతో విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలిస్తే తమ పెత్తనం, ఆదాయం తగ్గుతాని ఆ కార్యక్రమాన్ని నత్తనడక సాగిస్తున్నారు. ఇలాగయితే గ్రామ పరిపాలన పరిపుష్టం కాదు. తెలుగు దేశం ప్రభుత్వం ఈ గత ప్రభుత్వ తప్పిదాన్ని సరిదిద్దాలి. రాష్ట్రంలోని 30 వేల గ్రామపంచాయితీలను రెవిన్యూ గ్రామాలుగా ప్రకటించి పదో తరగతి పాసయిన యువకులను పోటీ పరీక్ష ద్వారా గ్రామ పాలనాధికార్లుగా నియమించాలి. యువకులను గ్రామపాలనలో రెగ్యులర్ ఉద్యోగులుగా నియమిస్తే రెవిన్యూ పాలన చురుగ్గా సాగుతుంది. పొరపాట్లు జరిగితే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకీ వీలుంటుంది. వారు ప్రాబల్యం పెంచుకుని రాజకీయాలు నిర్వహించకుండా బదిలీ చేసేందుకూ అవకాశం ఉంటుంది. 
గ్రామ పాలనను సమీక్షించండి
ఈనాడు 22-7-1994
ప్రభుత్వం గ్రామ పాలనను ఎన్నో ఒడిదుడుకులకు గురిచేసింది. ఎన్టీ రామారావు రద్దుచేసిన గ్రామాధికారుల వ్యవస్థను కొత్తరూపంలో ప్రజలపై రుద్దిన కీర్తి కాంగ్రెసు పార్టీదే. ఆ వ్యవస్థ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న మేలేమిటో ప్రభుత్వం పరిశీలించిన పాపాన పోలేదు. గ్రామాధికార వ్యవస్థ ప్యూడల్ వ్యవస్థకు ప్రతీక బదిలీ లేని పార్ట్ టైం ఉద్యోగాలు కావడం వల్ల వారు ఎమ్మార్వోలను ఖాతరు చేయరు. వారి రాజకీయలు వారికుంటాయి. ప్రజలకు పట్టించుకోరు. దానికన్నా వెయ్యి రూపాయల స్థిర వేతనంతో ఊరికో అభ్యర్థిని గ్రూప్ 4 ద్వారా నియమించి ఉంటే 30 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి దక్కేది. రెవిన్యూ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండి ఎంతో మేలు జరిగేది. ప్రభుత్వం గ్రామ పాలనాధికార్ల పనితీరును అధ్యయనం చేసి తగు మార్పులు చేయాలి.
రెవిన్యూ వసూళ్ళు ప్రైవేటు పరం
ఈనాడు 15-2-2005
రెవిన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న ఉత్సాహం రెవిన్యూ మంత్రి మాటల్లో చేతల్లో కన్పిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్ విలువను ఎప్పటికప్పుడు సమీక్షించడం, ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు కట్టుకున్న వారికి వాటిని మార్కెట్ రేటుకు విక్రయించడంలాంటి నిర్ణయాలు ప్రశంసనీయం. వీటివల్ల ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా వస్తుంది. ఇక మంత్రివర్యులు నీటితీరువా వసూళ్ళపై దృష్టి సారించాలి. నీటితీరువా వసూళ్ళలో గ్రామపాలనాధికార్లు అలసత్వంతో అవినీతితో వ్యవహరిస్తున్నారు. బకాయిలున్న రైతుల దగ్గర వందరూపాయలు పుచ్చుకుని కిమ్మనకుండా ఉంటున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎమ్మార్వోలు ఒత్తిడి చేస్తున్నా గ్రామ పాలనాధికార్లు చొరవతో వసూళ్ళు చేయడం లేదు. అందువల్ల రెవిన్యూ  బకాయిలు వసూళ్ళ బాధ్యతను కూడా వేలం పద్ధతిన ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం మంచిది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ముందుగానే డబ్బు జమపడుతుంది.
రెవిన్యూ శాఖను ప్రక్షాళించాలి
ఈనాడు  17-11-1999
స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు 12 మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేయటం శుభ పరిణామం. అవినీతికి ఆలవాలమైన రెవిన్యూ శాఖను ప్రక్షాళించాల్సి ఉంది. ఇందుకోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక అమలు పరచాలి. జిల్లాల విభజన, జోన్ లకు రెవిన్యూ కమిషనర్ల నియామకం ఎం. ఆర్. ఓ లకు మెరుగైన రవాణా సౌకర్యాలు లాంటి చర్యలు చేపట్టాలి. పన్నుల వసూళ్ళు సక్రమంగా జరిగేలా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలి.



రెవిన్యూ శాఖలో గందరగోళం
ఈనాడు  15-4-1995
 పాలకులు అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాల ఫలితంగా రెవిన్యూ శాఖలో గందరగోళం నెలకొంది. కుక్క బోతు వాడి ముందు ఇల్లు కడితే కూలిందాకా ఒకటే పోరు బెట్టినట్లు తాలూకాల్ని విడగొట్టి మండలాలు ఏర్పాటు చేసింది మొదలు వాటిని అస్థిరత్వం పాల్జేయడానికి కాంగ్రెస్ శత పోరింది. ప్రజల ముంగిళ్ళలోకి పాలనాలయాలను తీసుకెళ్తామని ప్రగల్భాలు పలికిన తెలుగుదేశం పాలనా సౌలభ్యం కోసం నాలుగైదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయలేకపోయింది. దీనికి తోడు రెవిన్యూ ఉద్యోగుల్లో భయాందోళనలను రగిలిస్తున్నారు.  ఈ మధ్యనే 500 మంది తహసీల్దార్లకు డిప్యూటీ తాహసీల్దార్లుగా రివర్షన్ ఇచ్చారు. అన్ని రకాల బాధ్యతలను మోస్తున్న ఎమ్మార్వోలలో 850 మంది ఇంకా ఎన్జీవోలుగానే ఉన్నారు. కారణాలు ఏవయితేనేం అటు ప్రజలకు సౌలభ్యం లేదు ఇటు ఉద్యోగుల్లో సంతృప్తి లేదు. మంత్రివర్యులు రెవిన్యూ శాఖలో గందరగోళాన్ని తొలగించాలి.
రెవెన్యూ అధికార్ల కష్టాలు
ఈనాడు 10-12-1998
ఎన్నెన్నో ఒత్తిడుల మధ్య రెవిన్యూ అధికార్లు తమ బహుముఖ విధులను నిర్వర్తిస్తున్నారు. రాజకీయుల బెదిరింపులు, ఉన్నతాధికార్ల హెచ్చరికల మధ్య కత్తి మీద సాములాగా పని చేయాల్సి వస్తోంది. మంత్రులు, ముఖ్యమంత్రి ఇతర వి.వి.ఐ.పి.లు పర్యటనకొస్తున్నారంటే చాలు వారి గుండె గుభేలుమంటుంది. ప్రజా సదస్సులు, అధికార సభల నిర్వహణ భారం కూడా వారి మీదే పడుతుంది. రాత్రింబవళ్ళు శ్రమించడమే కాకుండా కొన్ని ఖర్చులు జేబు నుండే పెట్టుకోవాలి. వి.ఐ.పి.ల అతిధి సత్కార్యాల ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చేది నామమాత్రం. వారికి మర్యాదలో ఏ మాత్రం లోటు వచ్చినా చీవాట్లు తప్పవు. అందువల్ల ఖర్చులన్నీ స్వయంగా భరించుకుని తంటాలు పడుతున్నారు. అయినా వీరిపై ఎవరికీ సానుభూతి ఉండదు. అడపాదడపా రెవిన్యూ అధికార్లపై నిఘావేసి కేసులు నమోదు చేసే అవినీతి నిరోధక శాఖ ఈ అంశంపైన దృష్టిసారించాలి. వి.ఐ.పి.ల ఖర్చులు ఎవరు భరిస్తున్నారో దర్యాప్తు చేయాలి.
శిస్తు వసూళ్ళపై కమీషన్
ఈనాడు 22-4-1992
రాష్ట్రంలో దాదాపు 329 లక్షల ఎకరాల పంట భూమి సాగులో ఉంది. ఎకరానికి అరవై రూపాయల చొప్పున వసూలు చేసినా ప్రభుత్వానికి ఏడాదికి 1970 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. శిస్తు వసూలు తదితర వ్యవహారాలను పర్యవేక్షించడం కోసం కొత్తగా గ్రామ పాలనాధికారులను నియమిస్తున్నారు. వీరిని పార్ట్ టైమ్ ఉద్యోగులుగా పరిగణిస్తామంటున్నారు. శిస్తు వసూలయినా, కాకపోయినా జీతభత్యాల కింద గ్రామ పాలనాధికారులకు కోట్లాది రూపాయలు చెల్లించే బదులు వసూళ్ళలో కమీషన్ ఇచ్చే విధానం ప్రవేశపెడితే వసూళ్ళు అనూహ్యంగా పెరుగుతాయి. కమీషన్ విధానం ఉంటే అధికారులు మొక్కుబడిగా విధులు నిర్వహించరు. ఉద్యోగ నిబద్ధతతో కాకపోయినా కమీషన్ పట్ల ఆసక్తితోనయినా వసూళ్ళు పెంచుతారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. నిధుల కొరత తీరి అభివృద్ధి కార్యక్రమాలూ ఊపందుకుంటాయి. 
'స్టేట్ సివిల్ పరీక్ష' నిర్వహించాలి
ఈనాడు 11-12-1990
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎ పరీక్షలను జనవరి మాసాంతానికి వాయిదా వేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు వాయిదా పడ్డాయి కనుక ఈ పరీక్షల్ని కూడా  వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులోని తార్కి'కత' ఏంటో బోధపడడంలేదు. ఏ చిన్న కారణం దొరికినా, వెంటనే వాయిదా వెయ్యడం ఆనవాయితీ అయ్యింది గానీ, ప్రకటించిన సమయానికి పరీక్షలు సక్రమంగా జరగడంలేదు. అన్ని గ్రూపులకూ కలిపి స్టేట్ సివిల్ పరీక్ష పేరిట ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఒక పరీక్ష నిర్వహించవలసిన కమీషన్, గ్రూప్ 1, గ్రూప్ 2 అని విడగొట్టి తన ఇష్టమొచ్చివప్పుడు పరీక్షలు నిర్వహిస్తోంది. ఇన్ని రకాల పరీక్షల వల్ల అభ్యర్ధులకు, కమిషన్ కు కూడా ఖర్చు ఎక్కువ అవుతోంది. గ్రూప్ 1, గ్రూప్ 2ఎ, బి లకు బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత. కనుక ఆ మూడింటినీ కలిపి 'స్టేట్ సివిల్ పరీక్ష' గా నిర్వహిస్తే అభ్యర్ధులకు వచ్చిన మార్కులను బట్టి ఆయా ఉద్యోగాలను కేటాయించవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో డబ్బు సమయం ఆదా అవుతాయి. కమిషన్ మీద పనిభారం బాగా తగ్గుతుంది. ఆలోచించమనవి.

స్థాయి సరే, వసతులేవీ ?
ఈనాడు లేఖలు 1-10-1994
రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ ఉద్యోగుల సంఘంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 245 మండలాలను తహశీల్దారు స్థాయికి అప్ గ్రేడ్ చేసింది. దానితో రెవిన్యూ పరిపాలన సజావుగా సాగడానికి వీలయింది. ఈ మండలాల్లోని ఎమ్మార్వోలు మరిన్ని బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. స్థాయి పెంచారు గాని వసతులు కల్పించడానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. చాలా కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. తగినంత సిబ్బంది లేరు. వాహన సౌకర్యమూ లేదు. సత్వరమే ప్రాథమిక వసతులు కల్పించి రెవిన్యూ పరిపాలనను పటిష్టం చేయాలి.

రెవెన్యూ శాఖకు పనిభారం
ఈనాడు 22-11-1991
రాష్ట్ర నిత్యావసర వస్తువుల పంపిణా సంస్థను పౌరసరఫరాల శాఖలో విలీనం చేశారు. ఇందువల్ల సిబ్బంది సంఖ్య పెరిగి ఇబ్బందులు కొన్ని తొలిగాయి. రేషన్ కార్డుల మీద 'సివిల్ సప్లయిస్ డిపార్ట్ మెంట్' అని ముద్రించారు గాని, నిజానికి పౌరసరఫరాల కోసం ప్రత్యేక శాఖ లేదు. పని అంతా రెవెన్యూ శాఖ వారే చేస్తున్నారు. ఇందువల్ల రెవెన్యూ శాఖకు పనిభారం అధికమవుతోంది. ఈ సమస్య తీరాలంటే పౌరసరఫరాల పని భారాన్ని రెవెన్యూ శాఖ నుంచి తప్పించి పౌరసరఫరాల శాఖే స్వయంగా నిర్వహించాలి. అలా వీలు కానపుడు పంచాయితీ రాజ్, పౌరసరఫరాల శాఖలను రెవెన్యూ విలీనం చేసి రెవెన్యూ వ్యవస్థను బలపరచాలి. లేని పక్షంలో అదనపు భారాన్ని మోసీ మోసీ రెవెన్యూ శాఖ రాను రాను నాసిరిల్లి పోవడం ఖాయం.

సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు
ఆంధ్రజ్యోతి  28-11-1991
 ప్రతి ఏటా రిక్రూట్ అయి వస్తున్న డైరెక్టు ఐ.ఎ.ఎస్. అధికారుల వల్ల క్రింది స్థాయి ఉద్యోగుల ప్రమోషన్ అవకాశాలు దెబ్బతింటున్నాయి. ముప్పై ఏళ్ళ సర్వీసు ఉన్నా జిల్లా కలెక్టర్ పదవినందుకోలేని దుస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాపురించింది. రెవెన్యూ డిపార్టుమెంటులో గుమస్తాగా చేరిన వ్యక్తి గుమస్తాగానే రిటైరు అవుతున్నాడు. డిప్యూటీ తహశీల్దారు మొదలు జిల్లా కలెక్టరు వరకు అన్ని పోస్టులూ డైరెక్టు రిక్రూట్ మెంట్ అభ్యర్ధులతోనే భర్తీ అవుతున్నాయి. రెవిన్యూ వెట్టిచాకిరీలో నలిగిపోయిన పెద్దలకు, వృద్ధులకు ప్రమోషన్లు దొరికే అవకాశమే ఉండటం లేదు. అందువల్ల జిల్లా కలెక్టరు పదవితోపాటు ఇతర ఉన్నతాధికార పదవులన్నిటికీ కొన్నాళ్ళ పాటు డైరెక్టు రిక్రూట్ మెంట్లు ఆపివేసి సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు ఇవ్వాలి. అలా వీలు కాదనుకుంటే కనీసం సగం పోస్టులనైనా ప్రమోషన్ ప్రాతిపదికన భర్తీ చేయాలి.

Pay lapses galore
Indian Express 15-5-1984
Mr. N. Rahamthulla    Nellore - 524003
The Government of Andhra Pradesh has appointed Mr. U.E.  Raghavendra Rao, Secretary to the Governmennt, Finance    Department, as one-man commission to go into the anomalies of   the existing pay scales of NGOs (G.O.Ms.No.21 Finance dated 23- 1-1981). I request the one-man panel to rectify he anomalies which  occurred while revising pay scales to the non-teaching employees. The non-teaching staff are incurring an average loss of Rs. 300 in comparison to the teaching staff. It will be better if the  government regroups the pay scales of the non-teaching staff in the  same manner as it was done to the teaching staff in 1932.
అధికారులకే అదనపు ఖర్చు
ఈనాడు 14-11-1986
ఈ నెల పదవ తేదీన ఈనాడులో ప్రచురించిన సంపాదకీయం   ఏకపక్షంగా ఉంది. ఉద్యోగుల కోర్కెలు తీరిస్తే ప్రభుత్వం పై పడే అదనపు    భారం, రాష్ట్రం యొక్క రుణ పరిస్థితిని విపులంగా చర్చించిన సంపాదకీయం లో ముఖ్యమంత్రి స్వంత ఆలోచనలో అయిదు కోట్లు ఖర్చు పెట్టి స్థాపించిన     విగ్రహాల సంగతి ప్రస్తావించకపోవడం వల్ల పరిస్థితి పాక్షికంగా మాత్రమే వెల్లడించినట్లయింది. పైగా పేద ప్రజలకు కిలో రెండు రూపాయల బియ్యం   పథకం ఆపివేయాలా అని అడగటం బాగులేదు. ఆ పథకాన్ని ఆపమని ఉద్యోగులు కోరలేదు. పైగా నిత్యావసర వస్తువులు చౌకధరలకిప్పిస్తే జీతాలు పెంచమని అడగబోమని కూడా వారన్నారు. జాతీయవేతన విధానాన్ని  సమర్థించటంతో ఆగకుండా దానిని అనుసరించమని కూడా రాష్ట్ర   ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్లయితే బాగుండేది. కనీస వేతనాన్ని పది  రూపాయలు పెంచటానికి వెనుకాడుతున్న ప్రభుత్వం అత్యన్నత అధికారులకు ఎనిమిది వందల రూపాయలు హెచ్చిస్తున్నది. పెరుగుతుందనుకుంటున్న నూటముప్పయి మూడు కోట్ల రూపాయల  అదనపు ఖర్చులో అరవై కోట్ల రూపాయలు కేవలం నలభై వేలమంది గెజిటెడ్ అధికారులకు ఇవ్వజూపుతున్నది. పొట్ట కూటి కోసం బడుగు  ఉద్యోగులు సమ్మె చేస్తారు. శలవులు కోల్పోయేది. ఆందోళనలో పాల్గొనేది చిరుద్యోగులే. సాధించే ఫలితంలో మాత్రం అరవై శాతం అధికారులకే పంచి  పెట్టే ప్రభుత్వాన్ని ఏమనాలి!
అలవెన్సులపై పన్ను భారం తొలగించాలి
ఆంధ్రప్రభ 6-4-1986
 కరవు భత్యం, ఇతర అలవెన్సులన్నిటినీ ఆదాయపు పన్ను నుండి మినహాయించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరగా తేల్చాలి.అలవెన్సులనేవి కొన్ని ప్రత్యేక ఖర్చులను భరించుట కోసం ఇచ్చేవి. కనుక ఒక్క ఆదాయపు పన్ను  నుండే గాక, అన్ని పన్నుల నుండి  వాటికి మినహాయింపు ఇవ్వాలి. కొన్ని  స్కాలర్ షిప్పుల మంజూరు లోను, హాస్టల్ సీట్లు పొందటానికి తల్లిదండ్రుల సంవత్సరాదాయం ఒక నిర్ణీత మొత్తాన్ని మించరాదని నిబంధన ఉంది.అయితే ఆ సంవత్సరాదాయ పరిమితిలో నుండి అలవెన్సులన్నిటినీ మినహాయించాలి. అప్పుడే నిజమైన ఆదాయం మీద పన్ను   పడినట్టవుతుంది.

2 కామెంట్‌లు:

  1. మిత్రుడి లేఖాస్త్రాలు ఉద్యోగుల్నీ , ఆదేమాదిరిగా ,ప్రభుత్వం ను సైతం ఆలోచింప చేసివిగా వుండటమే గాక ,కొన్ని సంధర్భాల్లో ఇబ్బందికి గూడా గురిచేసినవి . ఏదిఏమైనా మెజారిటీ కి , ప్రజలకు గాని , ఉద్య్యోగులకు గాని మేలు కలగాలనే ఆకాంక్ష ప్రశంసనీయం .

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు మోహన్.ఓపికగా చదివి స్పందించినందుకు.

    రిప్లయితొలగించండి