ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఆగస్టు 2013, మంగళవారం

ధరలు



కలర్ టి.వి. ధర
           

        ఆంధ్రప్రభ 22-9-1989                                      
       మన దేశంలో కలర్ టి.వి. ల మీద 50 శాతం ఎక్సైజ్ భారం ఉన్నదనీ, విదేశీ మార్కెట్లను ఆకర్షించే పద్ధతిలో రాయితీలు కల్పించాలని శ్రీ షేర్ సింగ్  పేర్కొన్న విషయం మనం ఆలోచించాలి. చైనాలో కలర్ టి.వి ధరలే సగం  ఉంటుందట [షేర్ కాలమ్ 18-9-1989]. మన దేశం కూడా పారిశ్రామిక దేశాల    జాబితాలో చేరిందని నేతలు చంకలు గుద్దుకుంటున్నారు గాని  ఈ దేశంలో  ధరలు పెరగని వస్తువేదో చెప్పమనండి. అసలే ధర ఎక్కువ దాని మీద   రకరకాల పన్నులు. అన్ని పన్నులు కలుపుకొని కూడా కొన్ని విదేశీవస్తువులే మనకు చౌకగా లభిస్తున్నాయి. దేశ ప్రజలు కొనుగోలు శక్తిని అధిక ధరలు, పన్నులు బాగా దెబ్బతీసి, పారిశ్రామిక వేత్తలకు, ప్రభుత్వానికి మాత్రమే లాభదాయకంగా ఉంటున్నాయి. పోర్టబుల్ కలర్ టి.వి ధర దీనికి    చిన్న ఉదాహరణ.


సర్వం కల్తీమయం !
                                                           
     'ధరవర()లు' అనే 'ఆంధ్రప్రభ' సంపాదకీయం చాలా వాస్తవంగా ఉంది.       నిజానికి నిత్యావసర వస్తువుల ధరలు వరదలతో పోటీపడి పెరిగిపోయి ప్రజలు నిస్సహాయుల్లా చూస్తూ ఉంటే ఒక్క కమ్యూనిస్టు పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఏమీ పట్టనట్టు కూర్చున్నాయి. మన నాయకులకు తమ       క్షేమం తప్ప ప్రజాక్షేమం పట్టడం లేదు. పచ్చి స్వార్ధం, ధనాపేక్ష        పదవులకోసం ఆరాటంతో ఈ రాజకీయ నాయకులు పారిశ్రామిక వేత్తలకు,        వ్యాపారవేత్తలకు, ఎగుమతి దారులకు, లంచగొండులకు దాసోహం    అంటున్నారు. లేకపోతే ఈ ధరలు ఎందుకిలా పెరుగుతాయి?

              కొబ్బరినూనె తలకు రాసుకోవాలంటేనే భయం వేస్తున్నది. ఎంతో      చక్కగా, చిక్కగా ఉండవలసిన కొబ్బరి నూనెను పెద్ద పెద్ద షాపులలో సైతం      కల్తీ చేస్తున్నారు. ఫ్రిజ్ లో పెట్టినా కొబ్బరినూనె గడ్డ కట్టడం లేదు. రాతి నూనె లాగా బెరబెరలాడుతోంది. తలకు రాసుకుంటే వెంట్రుకలు రాలిపోతున్నాయి. కళ్ళు మంటలు పెడ్తున్నాయి. వేరు శనగనూనెని కల్తీ    చెయ్యడం వల్ల జీర్ణ వ్యవస్థ, ఆరోగ్య దెబ్బ తింటున్నది.


విమర్శ కాదు మార్గం కావాలి
          ఈనాడు 28.2.82                                                           
                                                             
              ఆర్. టి. సి బస్ ఛార్జీలు పెంచటం పట్ల అందరూ ప్రభుత్వాన్ని   విమర్శిస్తున్నారు. కాని ఛార్జీలు తగ్గించేందుకు ఉపాయాలు ఎవరూ చెప్పటం      లేదు. ప్రతి పక్షాల ఆదరణ యోగ్యమైన మార్గాలు సూచిస్తే వాటిని       అనుసరిస్తామని ప్రభుత్వం అంటున్నది కదా? ఆర్.టి.సి.ని ప్రతిపక్షాలకు       అప్పచెబుతామన్నారు కదా? మరి వాళ్ళయినా దాన్ని సమర్ధంగా        నిర్వహించగలరా! పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికే ఇది తప్పలేదు. ఇది ఒక   అంతర్జాతీయ సమస్య. మేధావులు ఈ విషయంలో తగిన సూచన లిస్తే        ప్రభుత్వం వాటిని అమలు చేస్తుంది.


పామోలిన్ డబ్బాలు దండుగ
                                                           
          ఈనాడు 7-1-1987                                                 

     చౌక ధరల దుకాణాలలో ఇచ్చే పామోలిన్ నూనె డబ్బాలను ఈ  మధ్య మద్దెల షేపులో రెండు వైపులా మూసివేసి పంపిణీ చేస్తున్నారు.  ఇంతకు ముందు మూతలు కలిగిన డబ్బాలలో నూనె సరఫరా చేసేవారు. నూనె అయిపోగానే ఆ డబ్బాలు ఇతర పదార్ధాలు పోసుకోవడానికైనా ఉపయోగించేవి. లేదా కనీసం పావలాకైనా పాత సామాన్ల వాడు  కొనుక్కునేవాడు. ఇప్పుడు ఖాళీ డబ్బాలకు గానూ    పౌరసరఫరాల సంస్ధ ఎనిమిది రూపాయలకు పైగా అదనంగా ప్రజల నుండి  రాబట్టుకుంటోంది.


ధరల భరతం పట్టాలి
                                                           
          ఆంధ్రజ్యోతి 26-9-1989                                   

                        ధరల పెరుగుదల పట్ల మార్క్సిస్టు పార్టీ శాసన సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తే 'కోటి మందికి రెండు రూపాయల బియ్యం ఇస్తుంటే ధరలు ఎలా పెరుగుతాయి?' అని ముఖ్యమంత్రి ఆశ్చర్య పోయారట. రాగి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు పుడతారని చెబితే, ఒకామె చుట్టు చుట్టుకూ కడుపు చూసుకున్నదట. ఈ రెండు రూపాయల బియ్యం తోటి రాష్ట్ర ప్రజల దరిద్రం తీరుతుందని అన్నగారు ఏయేటి కాయేడు ఇంకా ఇంకా నమ్ముతున్నారు. మనల్నందరినీ నమ్మించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.


క్రూడాయిలే కాదు, కొబ్బరి నీళ్ళు కూడా...
      ఈనాడు 13-8-1988                                                      
                                                                                    
                        ఇండియా నుండి ఇతర దేశాలను ఎగుమతి చేసే వస్తువుల్లో కోడి     గ్రుడ్లు, కూరగాయలు, రొయ్యలు, జీడిపప్పు ప్రముఖంగా ఉన్నాయి. ప్రజల    నోటి కాడ 'కూడు' ను ఎగుమతి చేసి 'క్రూడాయిల్' గూడా ఎగుమతి చేస్తారట.   మనదేశంలో ఏ వస్తువులైతే కొరతగా ఉండి ధరలు ఎక్కువగా ఉంటాయో   వాటిని ఎగుమతి చేస్తున్నారు. ఏ వస్తువులు ధరలు పడిపోయి నిల్వలు       కొల్లలుగా పేరుకు పోయాయో, వాటినే దిగుమతి చేస్తున్నారు. ఉదాహరణకు      ప్రత్తి, పొగాకు రైతులకు మంచి ధరలు ముట్ట జెప్పి వాటిని ఎగుమతి        చేయవచ్చు. కాని ప్రత్తి దిగుమతి చేస్తున్నారు.

              కొబ్బరి నీళ్ళ కోసం లేత కొబ్బరి కాయలను పగుల గొడతారు. తద్వారా కొబ్బరి ఉత్పత్తికాదు. కొబ్బరి నూనే కొరత ఏర్పడి, ధర నాలుగింత     అయినా ఆశ్చర్యం ఉండదు. అసలు ఆహార పదార్ధాలు తప్ప ఎగుమతి   చేయటానికి ఇండియాలో మరేమీలేవా?
      
              ఈ దేశ ప్రజలకు పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. సారం    తీయబడిన బియ్యం, గోధుమలు చౌక డిపోలలో అమ్మతున్నారు. వెన్న,       మీగడలు తిని బాల కృష్ణుల్లా ఉండాల్సిన మన పిల్లలకు వెన్న తీసిన పాలే     పంపిణీ అవుతున్నాయి. మనుషుల ప్రాణాలతో ఆడుకొనే కల్తీదారులు        అధికమయ్యారు. వాళ్ళను సంరక్షించే లంచగొండి అధికారులు, నాయకులకు ప్రజాక్షేమం గురించి పట్టడం లేదు. కొబ్బరి నూనే తలకు        రాసుకుంటే అయిది నిముషాల్లో ఆరిపోతున్నది. వెంట్రుకలు     రాలిపోతున్నాయి. కళ్ళు మంట పుడుతున్నాయి. వేరుశనగ నూనే 28    రూపాయలయ్యింది. అదీ కల్తీనే.
      
              ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్అనే       మాట అక్షరాల నిజం. కల్తీదారులు, బ్లాక్ మార్కెటర్లు, లంచగొండి, అధికారులు, దుర్వ్యాపారులు, వాళ్ళ ప్రయోజనాలను కాపాడుతున్న       రాజకీయ నాయకులకు ఈసురోమంటున్న ప్రజల ఉసురు తప్పక      తగులుతుంది.


కనికరం చూపని కేంద్రం
                                                           
          ఈనాడు 13-9-1988                                                     

                        దిగుమతి చేసుకున్న వంటనూనెల ధరల కేంద్ర ప్రభుత్వం పెంచిందనే       కారణంతో పామాయిల్ ధరను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఒక ప్రక్క వంటనూనెల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరిగిందనీ, నూనెగింజల విషయంలో స్వయం సమృద్ధి సాధించామనీ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈనాటికీ   దిగుమతి చేసుకునే దౌర్భాగ్యం మనకు తప్పలేదు. పైగా చీటికీ మాటికీ   ఇలా పిడుగుపాటు లాగా ధరలు, పన్నులు పెంచుతూనే పోతున్నారు. ధరలు పెంచబోయే ముందు ఎవర్నీ సంప్రదించడంలేదు. కనీసం తమను ఎన్నుకున్న ప్రజల మీద కనికరం కూడా చూపడం లేదు. నిత్యవసర  వస్తువుల పంపిణీ విధానాన్ని నాశనం చేస్తున్నది. పౌర సరఫరాల సంస్థల  మీద కూడా ఆదాయం పన్ను విధించి రాష్ట్రాలను బాధిస్తున్నది. ప్రాజెక్టులకు  అనుమతి ఇవ్వడం లేదు. ద్రవ్యోల్బణానికి, లోటు బడ్జెట్ లకు కేంద్రమే    మూల కారణం అవుతున్నది.


ప్రాణంతో చెలగాటం
ఈనాడు 8-3-1983                                         ఎన్. రహంతుల్లా
                                                              చీమకుర్తి
                                                              ప్రకాశం జిల్లా       
              పెంచదలుచుకున్న ధరలన్నీ పెంచేసి, సుంకాలు పన్నులు     ఇబ్బడిముబ్బడి చేసేసి, పార్లమెంటులో పన్నుల్లేని బడ్జెట్ ప్రవేశ పెట్టడం మన పాలకులకు అలవాటే. యధా ప్రకారం ఈసారి కూడా అదే పని       చేసింది కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ. అయితే ఈ ధరలు, సుంకాలు, పన్నుల      పెంపుదలకు ఏమన్నా అర్థముండాలి కదా. ఒక పక్క ఓపెక్ దేశాలు        పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో దించేశారు. ఇంకో        పక్క దేశంలో పెట్రోల్ ఉత్పత్తి అద్భుతంగా పెరిగింది. ఇంత పెట్రోలియం      ఉత్పత్తుల ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? అందినకాడికి అప్పులు చేసి,   అప్పునాయకత్వంలో ఆటలాడించడమెందుకు, అసలే బతుకు బరువుతో       కుంగిన బీదల ప్రాణాలతో చెలగాటమాడటమెందుకు? బడ్జెట్ లో పెద్దగా       వడ్డింపులు లేకపోయినా, ముందు వెనుక ఎడా పెడా వడ్డించిన దానితో     దేశంలోని అన్ని వస్తువుల ధరల్లోనూ మార్పురావడం మాత్రం ఖాయం!



కేంద్రమే కారణం
ఆంధ్రప్రభ 28-12-1988                                              
              పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది తప్ప      ఇందులో తెలుగుదేశం గొప్ప ఏమీలేదని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ జలగం వెంగళరావుగారు సెలవిచ్చారు. అంటే ధరలు పెరుగుతున్నాయనీ, ఈ పెరుగుదల బడ్జెట్ తదితరమైన వాటిలో ప్రతిఫలిస్తుందనీ జలగం వారికి        అర్ధమయిందన్న మాట. బడ్జెట్ పెరుగుదలకు వర్తింపజేసిన సూత్రాన్నే   బస్సు చార్జీల పెరుగుదలకు కూడా కాంగ్రెస్ వారు వర్తింపజేసే ఈ బస్సు రోకో        లాంటి పనులకు పాల్పడవలసిన అవసరం లేకుండేది. 54817 కోట్ల    రూపాయల విదేశీ రుణం మీద ఏడాదికి 2520 కోట్లు వడ్డీగా కేంద్రం    చెల్లిస్తున్నది. రూపాయి మారకం రేటును అనేక సార్లు తగ్గించింది. దేశంలో       10 శాతం ద్రవ్యోల్బణం తిష్ఠ వేసి ప్రజల్ని పీడిస్తున్నది. ప్రతి ఏడూ పన్నులు   పెంచుతూ కూడా లోటు బడ్జెట్ సమర్పిస్తున్న కేంద్ర దుచ్చేష్టల వల్ల పెరిగే ధరలలో బస్సు చార్జీలు ఒక అంశం మాత్రమే. ధరలు తగ్గించమని కాంగ్రెస్      వారు కేంద్రాన్ని వేడుకోవాలి.



రూపాయి విలువను కాపాడండి
ఈనాడు 7-8-1993                                                   

విలువ తగ్గిన రూపాయివల్ల విదేశీ సంస్థలు, విదేశీ బ్యాంకులో లాభాలు దండుకున్నాయని యలమంచిలి శివాజీ ఇటీవల వ్యాసంలో చక్కగా వివరించారు. ఈ వ్యాసం మన నేతలకు కనువిప్పు కావాలి. రూపాయి విలున తగ్గింపు మన మేలు కోసమేనని ఎన్నాళ్ళు నమ్మిస్తారు ? రూపాయి విలువను పది పైసలకు దించి ప్రపంచబ్యాంకు, ఐ.ఎం.ఎఫ్. షరతులకు తలూపే ప్రభుత్వాన్ని ఏమనాలి ? దిగుమతులు తగ్గించుకొని, ఎగుమతులు పెంచి రూపాయి విలువను కాపాడుకోవడం తక్షణ కర్తవ్యం.


కడుపు కాల్చుకునా, కాసుల ఆర్జన?
ఈనాడు -16-10-1990                                             

జంటనగరాల చుట్టూ కూరగాయలు పెంచి విదేశాలకు ఎగుమతి చెయ్యాలని ముఖ్యమంత్రి రూపొందించిన పథకం ఏమంత బాగోలేదు. అలా పెంచే కూరగాయలు జంటనగరాలకే తక్కువ ధరలకు విక్రయించవచ్చుగదా? పైగా  మధ్యప్రాచ్యదేశాలకు ఎగుమతి చేయడం కోసం రాష్ట్రంలో అయిదు చోట్ల ఆధునిక పశువధశాలలు ఏర్పాటు చేయబోతున్నారు. వీటిలో రోజుకు పది వేల పశువులు హతం అవుతాయి. రాష్ట్ర ప్రజలకు మాంసం, కూరగాయలు సరిగా లభ్యం కావడంలేదు. వాటి ఖరీదు చాలా హెచ్చుగా ఉంది. విదేశీ మారకద్రవ్యాన్ని ఇబ్బడిముబ్బడిగా ఆర్జించాలన్న ఆశయం మంచిదే. కానీ, కడుపు కాల్చుకునా, కాసుల ఆర్జన ? 



మనకు లేకుండా ఎగుమతులా ?
జనవాక్యం 24-11-1990                                           

జంటనగరాల చుట్టూ కూరగాయలు పెంచి విదేశాలకు ఎగుమతి చేయించాలని ముఖ్యమంత్రి చేసిన ఆలోచన అతిప్రమాదకరమైనది. ఇప్పటికే కూరగాయల ధరలు చుక్కలనంటాయి. ఆ పెంచే కూరగాయలు జంటనగరాల జనానికే తక్కువ ధరలకు విక్రయించవచ్చు.

పైగా మధ్య ప్రాచ్య దేశాలకు మాంసం ఎగుమతి చేయించడం కోసం రాష్ట్రంలో అయిదు చోట్ల ఆధునిక పశువధ శాలలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వీటిలో రోజుకు పది వేల పశువులు వధించబడతాయి. మన రాష్ట్ర ప్రజలకు కూరగాయలు, మాంసం సరిగా దొరకడం లేదు. వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంది. విదేశీ మారక ద్రవ్యం కోసం మన ప్రజల నోటి దగ్గర కూడు కూడా ఎగుమతి చేయబూనడం దుర్మార్గం. మన నోళ్ళు, కడుపులు కట్టుకుని సంపాదించే విదేశీ మారక ద్రవ్యం ఎవడికి కావాలి? ముందు తిండి విషయంలో మన జనాన్ని సంతుష్టి చెందనివ్వండి. ఆ తరువాత ఎగుమతులు తలపెట్టవచ్చు. తిండి లోపించిన జాతి బలహీనం అవుతుంది. జాతి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కూరగాయలు, మాంసం ఉత్పత్తిని పెంచి ప్రజలకు చౌకగా దొరికేలా పథకాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారికి మనవి. 



ధర తగ్గిస్తే దర్యాప్తు, పెరిగితే తెల్లమొహం!
ఈనాడు                                                

        'అకాయ్ హోం థియోటర్' పాతిక వేల రూపాయలకే అమ్మతున్న విషయం మీద కేంద్ర రెవెన్యూ శాఖ దర్యాప్తు చేస్తుందట. రామర్ పిళ్ళై లీటరు పెట్రోలు పది రూపాయలకే అమ్మతానంటే అక్కర్లేదన్నారు. ఉల్లిపాయలు కిలో 20 రూపాయల వరకూ అమ్మతున్నా విదేశాలకు ఎగుమతులు ఆపలేదు. చౌకగా వస్తువులందించే వారి మీద దర్యాప్తులు – అధిక ధరల విషయంలో తెల్లమొహం. వాణిజ్యం గ్లోబలీకరణ జరిగింది కాబట్టి విదేశీ కంపెనీలు చౌకగా వస్తువులు అందిస్తున్నాయి. అందుకు సంతోషించాల్సిందిపోయి దర్యాప్తులతో వారిని నిరుత్సాహ పరచడం, కొరత ఉన్న వస్తువుల్ని ఎగుమతి చేయడం మంచిది కాదు. ఇకనైనా  వినియోగదారుడికి అనుకూలంగా ఉండే విధానాలను ప్రోత్సహిస్తే సంతోషం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి