ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, ఆగస్టు 2013, బుధవారం

పాలనా సంస్కరణలు,వికేంద్రీకరణ



సూచన

        ఆంధ్రపత్రిక 30-10-1985                                     
                   ఆర్యా, మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ రాజకీయ      నాయకులు "వికేంద్రీకరణ". "సమగ్ర ప్రాంతీయాభివృద్ధి" అనే తరచుగా అంటూ ఉండటం తప్ప చేసిందేమీ లేదు. వాస్తవానికి అభివృద్ధి అంతా    పట్టణాల్లో కేంద్రీకరించబడింది. పట్టణ మోజులో వలస వెళ్ళే ప్రజల వల్ల   పట్టణాలలో బ్రతుకు చాలా నీచంగా మారింది. ప్రభుత్వం ఇక నుండైనా      వికేంద్రీకరణకు పూనుకోవాలి.

              ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలు    స్థాపించటానికి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తప్ప మరో మంచి ఊరే లేదా?      హైదరాబాద్ లో దాదాపు సగం మందికి స్వంత ఇళ్ళు లేవు. ఈ పట్టణం ఇంకా ఎంత పెరగాలి. హైదరాబాద్ కంటే ఎంతో మేలైన, ప్రశాంతమైన       నాగార్జున సాగర్ లోనే, మహేష్ యోగికి ఇవ్వజూపిన వెయ్యి ఎకరాల స్థలం లోనే ఈ రెండు యూనివర్సిటీలు స్థాపించవచ్చు గదా! ప్రభుత్వం      ఆలోచించాలి.



రాజధాని-రాజధానేతర ఉద్యోగులు
         

        ఆంధ్రపత్రిక 6-5-1986                             
                   ఆర్యా, 
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులకు, రాష్ట్ర      రాజధాని నగరంలో పనిచేసే ఉద్యోగులకు పనిభారంలో, పని పరిస్థితుల్లో   చాలా తేడా ఉంది. ఈ తేడాలు సుస్పష్టంగా కనబడుతున్నా నియమించబడిన పేరివిజన్ కమీషనర్లెవరూ పట్టించుకోలేదు. రాజధాని నగరంలో పనిచేసే ఉద్యోగులకు       కొన్ని సౌకర్యాలను పెంచాలనే విషయం ప్రభుత్వానికీ పట్టడం లేదు.

1.    సెక్రెటేరియట్-నాన్ సెక్టెటేరియట్ ఉద్యోగుల మధ్య ప్రభుత్వం తేడా చూపిస్తున్నది. 30 ఏళ్ళ నుండి ఉద్యోగులు ఈ తేడాను రూపుమాపాలని మొరపెడుతున్నా ప్రభుత్వం వినలేదు. మరి రాజధాని – రాజధానేతర ఉద్యోగుల మధ్య కూడా ప్రభుత్వం తేడా ఎందుకు చూపదు?

2.    ఉదాహరణకు ప్రకాశం జిల్లా వైశాల్యం 17620 చదరపు కిలో మీటర్లు అంత విశాలమైన భూమిలో 23 లక్షలమంది ప్రజలు సౌకర్యంగా నివసిస్తున్నారు. అయితే అంతకంటే ఎక్కువ మంది జనం కేవలం 217 చదరపు కిలో మీటర్ల వైశాల్యం గల పట్టణంలో కిక్కిరిసి నివసిస్తున్నారు. వాస్తవానికి ఎవరికి ఎక్కువ సౌకర్యం ఉంది? జనసాంధ్రతను బట్టి అలవెన్సులు పెంచవద్దా?

3.    నగర శివార్లలో నివసించే ఉద్యోగి కనీసం 30 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి. అంటే జిల్లాలలోని ఉద్యోగుల కంటే రాజధానిలోని ఉద్యోగులు ఒక గంట ముందే బయలుదేరాలి. ఒక గంట ఆలశ్యంగా ఇంటికి చేరాలి. అంటే రెండు గంటలు కేవలం ప్రయాణానికే వెచ్చించాలి. దీనికి ప్రతిఫలం ఏది?

4.    రోజిరోజుకి పెరిగిపోతున్న జనాభా కొత్తగా వెలుస్తున్న కార్యాలయాలు ప్రభుత్వ కేంద్రీకరణ చర్య వల్ల రాజధానిలో గృహ సమస్య చాలా తీవ్రమై పోయింది. రాజధానిలో 70 శాతం ఉద్యోగులకు ప్రస్తుతం స్వంత ఇళ్ళు లేవు. అద్దెలు భరించలేని స్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వ క్వార్టర్లు కొత్తగా కట్టడం లేదు. అవి లభించాలంటే భగీరధ ప్రయత్నం చెయ్యాలి. అప్పటికీ క్వార్టర్ లభించటం అసాధ్యమే. మరి రాజధాని నగరపు ఉద్యోగులకు ప్రత్యేక ఇంటి అద్దెను మంజూరు చేయవద్దా? ప్రతి ఏడు కొత్తగా క్వార్టర్లు కట్టించవద్దా? స్వంత ఇళ్ళకై స్థలాలు కేటాయించవద్దా?
       ఈ పనులన్నీ చేయకపోతే రాజధానిలో ఉద్యోగం వెట్టిచాకిరి లాగానే ఉంటుంది.




మాకూ బదిలీ సౌకర్యం కావాలి
         

        ఆంధ్రజ్యోతి 1-5-1986                                             
                   రాయలసీమ ఉద్యోగులను రాయలసీమకు, తెలంగాణా ఉద్యోగులను తెలంగాణాకు, ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్రకు పంపివేయాలని రాష్ట్ర ప్రభుత్వ     ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒక్క హైదరాబాద్ లో పనిచేసే      ఉద్యోగులు మినహా మిగతా రాష్ట్రమంతటిలోని చిరుద్యోగులంతా ఎవరి   జోన్లకు లేదా జిల్లాలకు వారు హాయిగా వెళ్ళిపోతారు.

  అయితే ఎంతోకాలం నుంచి తమ సొంత జిల్లాలకు వెళ్ళిపోవాలని  అనేక వేల        మంది ఎన్జీవోలు, హైదరాబాద్ పట్టణంలో పనిచేసే వారు కోరుకుంటున్నప్పటికీ ఇది "ఫ్రీ జోన్" అయినందున వారి ఆశలు తీరడం    లేదు. ప్రభుత్వం ఇరు ప్రాంతాల నాయకులతో ఒప్పందం కుదుర్చుకుని   రాజధానేతర ప్రాంతాలవారికి అదృష్టాన్ని కలిగించింది కానీ, రాజధాని    ఉద్యోగుల విషయం మరచిపోయింది.

              రాజధానిలోని చిరుద్యోగుల జీవిత పరిస్థితులు చాలా దుర్భరంగా     ఉన్నాయి. పైగా ప్రతి డైరెక్టొరేట్ లోను ఖచ్చితంగా రాజధాని నగరంలోనే ఉండి తీరనక్కరలేని సెక్షన్లు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ జిల్లాలలోనే శాశ్వతంగా ఉంచవచ్చు. తద్వారా తమ ప్రాంతాలకు వెళ్ళాలని   ఉవ్విళ్ళూరుతున్న అనేక వేల మంది చిరుద్యోగులను వారి ప్రాంతాలకు పంపవచ్చు. రాజధాని నగరం మీద భారాన్ని తగ్గించవచ్చు.

    ప్రతి మంత్రిత్వ శాఖ, డైరెక్టొరేట్ల తరఫున రాష్ట్రంలోని మూడు    ప్రాంతాలలో మూడు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటుచేసి రాజధాని నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులను వారి వారి ప్రాంతాలను తరలించవచ్చు.

              ఇతర జిల్లాల వారందరికీ కలుగజేసిన బదిలీ సౌకర్యం హైదరాబాద్    లోని ఎన్జీవోలకు కూడా కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను.


మంత్రుల ఇళ్ళుంటేనే
పాత బస్తీకి మోక్షం
         

        ఆంధ్రజ్యోతి 19-2-1989                                  
                   హైదరాబాద్ లోని పాత బస్తీ బాగుపడాలంటే మంత్రుల నివాసాలు,    కార్యాలయ భవనాలు పాత బస్తీలోనే నిర్మించాలని శ్రీ నాదెండ్ల భాస్కరరావు      అన్నారు. చెప్పింది ఎవరైనా నిజం చెప్పినప్పుడు ప్రభుత్వం ఆలకించాలి. పట్టణాలలో అయిదు లక్షల ఇళ్ళు కట్టిస్తానంటున్న ముఖ్యమంత్రి మంత్రుల నివాసాలు కాకపోయినా పేదల ఇళ్ళైనా పాత బస్తీలో కట్టించాలి. గచ్చీ        బౌలీలో తమ ఇళ్ళ నిర్మాణం కోసం వెయ్యి ఎకరాల స్థలం ఇవ్వమని నగర ఎన్జీవోలు ఎంతగానో మొత్తుకుంటున్నారు. వారికి ఆ స్థలాన్ని పాత బస్తీ అవతల పహాడీ షరీఫ్ దగ్గర మంజూరు చేస్తే ఎన్జీవోల వల్లనైనా ఆ ప్రాంతం       అభివృద్ధి చెందవచ్చు. మంత్రులు రాజకీయ నాయకులు ఏదైనా ప్రాంతంలో ఉండలేకపోతే ఆ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని నివసింపజేయడం ద్వారా       ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు. వనస్థలిపురం ఇప్పుడెలా ఉందో        చూస్తున్నారుగా!


మంత్రుల ఆఫీసుల తరలింపు మంచిదే!
           

        ఆంధ్రప్రభ 3-6-1986                                            
                   సచివాలయం నుంచి మంత్రుల కార్యాలయాలను ఆయా డైరెక్టరేట్లకు తరలించాలని ప్రభుత్వం ఉద్దేశించటం చాలా మంచిది. ఇందువలన ఆయా     డైరెక్టరేట్లపై ప్రభుత్వానికి మంచి అదుపు లభించటమే గాక, సెక్రెటేరియేట్ కు        ఇచ్చిన అనవసర ప్రాధాన్యత తగ్గుతుంది. ప్రజలు ప్రతి విషయానికి ఇక   సెక్రెటరియేట్ కు పోకుండానే, ఆయా డైరెక్టరేట్లలోనే అన్ని పనులూ పూర్తి        చేసుకోవచ్చు. ఇది క్రమంగా జరిగితే నిశ్చయంగా మేలు చేసే పద్ధతే.

              కాని రాజకీయ నాయకులు ఆఫీసుల్లోకి వచ్చేస్తే వారి పరివారం       పైరవీలు, అధికార దుర్వినియోగం యధాతథంగా జరుగుతుంది. దీనిని   అరికట్టే మార్గం ప్రభుత్వం వెదకలేదు. ఇంతవరకూ సెక్రెటరియేట్ లో   కొనసాగిన అవినీతి ఇక నుంచి డైరెక్టరేట్లలో కొనసాగుతుంది. పైగా డైరెక్టర్ల   అధికారం, సంపాదనావకాశం కుచించుకు పోతుందని అప్పుడే        భయాందోళనలు మొదలయ్యాయి.


పాలనా సంస్కరణలు అమలు జరపాలి
                                                           
          ఆంధ్రప్రభ 24-9-1986                                   
                        తెలుగుదేశం పార్టీ పాలనా సంస్కరణల మీద ప్రభుత్వానికి చాలా     మంచి ప్రతిపాదనలు చేస్తుంది. వీటిని అమలు చేయనిస్తే రాష్ట్రం చాలా బాగుపడుతుంది. సెక్రెటేరియట్ - నాన్ సెక్రెటేరియట్, డైరెక్టరేట్- నాన్   డైరెక్టరేట్ అనే తేడాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులందరినీ సమానం     చెయ్యటం, మంత్రుల కార్యదర్శుల కార్యాలయాలను ఆయా డైరెక్టరేట్లలోనే      పెట్టడం. అన్ని డిపార్ట్ మెంట్లకు ప్రాంతీయ కార్యాలయాలను తెరచి రాజధాని        నుండి ఉద్యోగులను ప్రజల చేరువకు తరలించడం, అన్ని జిల్లా ప్రధాన        కార్యాలయాలలో కంప్యూటర్లు, పొటోస్టాట్ యంత్రాలు స్థాపించటం, సబ్ ట్రెజరీ        అధికారులను గజిటెడ్ అధికారులుగా మార్చటం మొదలైన ప్రతిపాదనలు శుభప్రదమైనవి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జీవోలు జారీ చేయాలి.


అదనపు బరువు

   "వికేంద్రీకరణ", "సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి",  అనే నినాదాలు   రాజకీయ నాయకుల నోటి నుండి తరచుగా వినవస్తుంటాయి. కాని       వాస్తవానికి సమస్త అభివృద్ధి పట్టణాల చుట్టూ కేంద్రీకరించబడి కొత్త      రుగ్మతలు వస్తున్నాయి.
 ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల స్థాపనకు        హైదరాబాద్ మినహాయించి మరో ఊరు ఈ తెలుగు దేశంలో దొరకలేదా?     హైదరాబాద్ అధిక జన భారంతో ఎన్ని రుగ్మతల్లో ఉందో ప్రభుత్వానికి       తెలియదా? హైదరాబాద్ లో ఈనాడు సగం మందికి స్వంత ఇళ్ళు లేవు. ఇంకెంత మందిని అక్కడికి తీసికెళ్ళి బాధపెట్టాలి? హైదరాబాద్ కంటే ఎంతో మేలైన ప్రశాంతమైన నాగార్జున సాగర్ లోనే, మహైష్ యోగి కివ్వదలచిన    వెయ్యి ఎకరాల స్థలంలో  ఈ రెండు యూనివర్సిటీల స్థాపిస్తే హైదరాబాద్ పై అదనపు భారం తగ్గడమే గాక, వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి